July 28, 2025 5:33 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Charminar: చార్మినార్ వద్ద సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ (Telangana) సంస్కృతి, సంపద్రాయాలు (Culture &Tradition), నగర వారసత్వాన్ని పరిచయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ హెరిటేజ్ వాక్ (Miss World Heritage Walk ) కార్యక్రమం నిర్వహించింది. మిస్ వరల్డ్ 72వ పోటీలు (Miss World 2025 Pageant) హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హెరిటేజ్ వాక్ పేరిట మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రపంచ సుందరీమణులు చార్మినార్ వద్ద సందడి చేశారు. చార్మినార్ నుంచి చుడీబజార్, లాడ్ బజార్, చౌమొహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్‌లో పాల్గొన్నారు.
నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అద్భుత కట్టడం వద్ద 109 దేశాలకు చెందిన మిస్‌ వరల్డ్‌ పోటీదారులు సందడి చేశారు.
చార్మినార్ వద్దకు చేరుకున్న వారికి అరబ్బీ మార్ఫా వాయిద్యాల సందడితో రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికారు. చార్మినార్ వద్దే వారందరీకి ప్రత్యేక ఫొటోషూట్‌ నిర్వహించారు. తరువాత వారు చార్మినార్‌లోకి వెళ్లి సుమారు అరగంట పాటు అక్కడ గడిపారు. నిర్మాణ శైలి, చారిత్రక నేపథ్యం వంటి అంశాలను తిలకించి, వివరాలను తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘ఇన్‌టాక్‌’ సంస్థ నిర్వాహకులు, పర్యాటక శాఖ గైడ్‌లు చార్మినార్‌ ప్రత్యేకతలను వివరించారు.
చార్మినార్‌ నుండి చుడీబజార్‌.. అక్కడి నుంచి చౌమొహల్లా ప్యాలెస్‌ వరకు సుమారు 40 నిమిషాల పాటు వీరు హెరిటేజ్‌ వాక్‌ చేశారు. ఈ వాక్‌లో భాగంగా వారు చుడీబజార్‌లోని ప్రసిద్ధ గాజులు, ముత్యాలహారాలు, ఇతర అలంకార వస్తువులను ఆసక్తిగా గమనించారు. గాజుల తయారీని కొందరు స్వయంగా వీక్షిస్తూ స్థానిక కళాకారుల నైపుణ్యాన్ని చూసి ముగ్ధులయ్యారు.
వ్యాపారులు వారికి గులాబీ పూలతో స్వాగతం పలికారు. పోటీదారులు ఎంచుకున్న గాజులు, అలంకార వస్తువులకి డబ్బు తీసుకునేందుకు నిరాకరించారు. ఇందుకు బదులుగా చార్మినార్, లాడ్ బజార్ ప్రత్యేకతలను వారి వారి దేశాల్లో చాటాలని సుందరీమణులకు వ్యాపారులు విజ్ఞప్తి చేశారు.
Share This Post
error: Content is protected !!