భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాము’ అని ప్రధాని మోదీ ప్రకటించారు.
పాశమైలారంలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమలో ఈ భారీ పేలుడు సంభవించింది. రసాయన పరిశ్రమంలో రియాక్టర్ పేలి మంటలు ఎగిసిపడ్డంతో పలువురు చనిపోగా అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు14 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల్ని రక్షించేందుకు అత్యవసరంగా అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను వినియోగించుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు సంతాపం తెలుపుతున్నారు.