భారత్ సమాచార్.నెట్: ఆక్సియం 4 మిషన్‌లో భాగంగా ఈ నెల 25న మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులతో కలిసి భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్‌లో శుభాన్షు శుక్లాతో మాట్లాడారు. వీళ్లిద్దరి మధ్య జరిగిన సంబాషణను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. మాతృభూమికి ఆయన దూరంగా ఉన్నప్పటికీ భారతీయుల హృదయాలకు అత్యంత దగ్గరగా ఉన్నారని ప్రధాని మోదీ కొనియాడారు.
ప్రధాని మోదీ శుభాన్షు శుక్లా మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రధానమంత్రి కార్యాలయం. ఆ ఫోటోలో ప్రధాని మోదీ, శుభాంశుతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న దృశ్యం ఉంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “ఇది భారత్‌కి గర్వకారణమైన క్షణం” అని చెప్పారు. అంతరిక్షంలో అనుభవం ఎలా ఉందని శుభాంశును అడిగారు. దీనికి శుభాంశు స్పందిస్తూ.. “అంతరిక్షం నుంచి భూమిని చూడడం ఓ ప్రత్యేక అనుభూతి. ప్రత్యేకించి భారత్‌ను అక్కడి నుంచి చూడడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది” అని చెప్పారు.
దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ.. “ఈ సమయంలో మీరు భారత్ భూమి నుంచి దూరంగా ఉన్నా.. భారత ప్రజల మనసుకు అత్యంత దగ్గరగా ఉన్నారు. మీ పేరులో కూడా ‘శుభ్’ ఉంది. ఇది అదృష్టాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఇద్దరం మాట్లాడుతున్నప్పటికీ నా వెంట 140 కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలు ఉన్నాయి. అంతరిక్షంలో భారత జెండా ఎగరవేస్తున్నందకు అభినందనలు అని” ప్రధాని మోదీ తెలిపారు. అలాగే, మోదీ శుభాంశును ప్రశ్నిస్తూ.. “అక్కడ అన్నీ బాగానే ఉన్నాయా? మీ ఆరోగ్యం క్షేమంగా ఉందా?” అని అడిగారు. కాగా 1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారతీయుడిగా శుభాన్షు శుక్లా రికార్డు సృష్టించారు.