భారత్ సమాచార్.నెట్: ప్రధాని మోదీ (PM Modi)పై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) విషయంలో భారత్ ప్రధాని మోదీ తమ డిమాండ్‌ను అంగీకరించలేదన్న యూనస్ చెప్పుకొచ్చారు. భారత్‌లో ఆశ్రయం పొందుతూ.. సోషల్ మీడియా వేదికగా బంగ్లా వ్యతిరేక విధానాలను షేక్ హసీనా పాటిస్తున్నారని.. షేక్ హసీనాను కట్టడి చేయాలని మోదీని కోరినట్లు తెలిపారు. అందుకు ప్రధాని మోదీ అంగీకరించలేదని చెప్పారు. లండన్‌లోని చాఠమ్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బిమ్‌స్టెక్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ సమావేశమైన యూనస్.. ప్రధానితో జరిగిన నాటి సంభాషణను గుర్తుచేసుకున్నారు. ప్రధాని మోదీతో తాను షేక్ హసీనా అంశంపై చర్చించినట్లు యూనస్ తెలిపారు. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా ఆన్‌లైన్ వేదికగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని.. దాని వల్ల బంగ్లా ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారని.. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు చెప్పారు. ఆమె ప్రకటనలు, ప్రసంగాలను అడ్డుకోవాలని సూచించినట్లు తెలిపారు. అందుకు మోదీ అంగీకరించలేదని, అది సోషల్ మీడియా.. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదని సమాధానం చెప్పారని యూనస్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే గతేడాది ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన బంగ్లాదేశ్ విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి పెట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. భారత్ నుంచి సోషల్ మీడియా వేదికగా బంగ్లా తాత్కాలిక సర్కారుపై ఆమె విమర్శలు, ఆరోపణలు చేస్తునే ఉన్నారు.
Share This Post