భారత్ సమాచార్.నెట్: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తాజాగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 21లోపు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు నటీ సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు.
కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. సురేఖ తరుఫు న్యాయవాది చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధరంగా ఉన్నాయని కేసు నమోదుకు ఆదేశాలివ్వాలన్న కేటీఆర్ తరఫున న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది నాంపల్లి కోర్టు. మరోవైపు ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. కేసు నమోదుపై తనకు ఎలాంటి సమాచారం లేదని.. కోర్టు నుంచి నోటీసు వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తామని చెప్పారు.
కాగా నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆర్ కారణమని.. కేటీఆర్ డ్రగ్స్‌కు బానిసని.. డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తారని కొండా సురేఖ ఆరోపించారు. అయితే కొండా సురేఖ ఆరోపణలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయని పేర్కొంటూ.. ఆమెకు లీగల్ నోటీసు పంపించారు కేటీఆర్. తన ఆరోపణలను వెనక్కి తీసుకొని.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ కొండా సురేఖ దీనిపై స్పందించలేదు.. దీంతో కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు.