భారత్ సమాచార్.నెట్: భారత్, అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహం నింగిలోకి పంపేందుకు రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ పాడ్ నుంచి రేపు సాయంత్రం 5:40 నిమిషాలకు జీఎస్ఎల్వీ ఎఫ్-16 రాకెట్ ద్వారా నిసార్ నింగిలోకి దూసుకెళ్లనుంది. భూ పరిశీలన కోసం ఇరు దేశాలు సంయుక్తంగా ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి.
నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2,392 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహం.. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్‌తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ప్రతీ 12 రోజులకు ఇది భూమిని పూర్తిగా స్కాన్ చేయగలదు. నాసా రూపొందించిన L -బ్యాండ్, ఇస్రో అభివృద్ధి చేసిన S-బ్యాండ్ SAR టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్‌ను భూమికి పంపించనుంది.
ఈ ఉపగ్రహం భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, వ్యవసాయం నమూనాలలో మార్పులను ట్రాక్ చేయడంతో ఉపయోగపడుతోంది. దీంతో విపత్తుల నిర్వహణకు నిసార్ ఎంతో ఉపయోగపడుతోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రయోగం అనంతరం 90 రోజుల్లో ఇది కార్యకలాపాలు ప్రారంభించనుండగా.. రాత్రి, పగలు తేడా లేకుండా.. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది భూమిని స్కాన్ చేయగలదు.