భారత్ సమాచార్.నెట్: భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా.. దేశంలోని ప్రజల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుంటూ కేంద్రంలోని ఎన్డీఏ (NDA) సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. దేశంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తినా.. కూరగాయలు (Vegetables) సహా నిత్యావసర వస్తువుల (Essential Commodities) కొరత ఉండబోదని.. తగినంత నిల్వలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి ప్రధాన ఆహార వస్తువుల ధరలు నియంత్రణలోనే ఉండేలా సమగ్రమైన పర్యవేక్షణ కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దేశంలోని అన్ని నగరాల్లో సరఫరా సజావుగా కొనసాగేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించాయి. అలాగే పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి కీలకమైన ఆహార పదార్థాల ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపడతామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ప్రజలు అవసరమైన వస్తువుల విషయమై ఎలాంటి ఆందోళన పడాల్సిన పనిలేదని తెలిపాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆహార శాఖ కార్యదర్శులతో పాటు ఇతర ముఖ్యమైన రంగాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
నిత్యావసర వస్తువుల ధరలను పెంచడాన్ని నియంత్రించడంతోపాటు.. నిల్వలను దాచడం వంటివి జరగకుండా చూడాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపింది. వ్యాపారులు, సరఫరాదారులపై నిఘా ఉంచాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాలపై మరింత శ్రద్ధ వహిస్తోంది. ఈ పరిణామాల్లో భాగంగా చండీగఢ్‌లో నిత్యావసర వస్తువుల నిల్వలపై నిషేధం విధించారు. స్థానిక అధికారులు అన్ని వ్యాపారులకు తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను మూడు రోజులలోపు ఆహార, సరఫరాల శాఖకు ఇవ్వాలని ఆదేశించారు.
Share This Post