Homebreaking updates newsఆర్జీవీపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఆర్జీవీపై నాన్ బెయిలబుల్ వారెంట్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (RGV)కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) హయాంలో సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu Naidu), మంత్రి లోకేష్‌లను కించపరిచే విధంగా చేసిన కామెంట్లు.. సినిమాల విషయంలో ఏపీలో కేసులు నమోదు కావడం.. ఆ కేసుల్లో విచారణలకు హాజరవుతున్న ఆర్జీవీకి తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

అయితే ఈ వారెంట్‌ను ముంబై (Mumbai)లోని సెషన్స్ కోర్టు జారీ చేసింది. అది కూడా 2018లో ఓ కంపెనీ పెట్టిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆర్జీవీకి చెందిన ఓ సంస్థ తమకు ఇచ్చిన చెక్కు బ్యాంకులో బౌన్స్ అయ్యిందంటూ 2018లో కోర్టును ఆశ్రయించింది. ఆ కేసులో ఈ ఏడాది జనవరి 21న అంధేరీలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం రాంగోపాల్ వర్మ శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్టు నిర్ధారిస్తూ మూడు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే, ఫిర్యాదుదారుడికి మూడు నెలల్లోగా రూ.3,72,219 చెల్లించాలని ఆదేశించింది.
ఈ తీర్పును రాంగోపాల్ వర్మ సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. తాజాగా వర్మ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఆర్జీవీ పిటిషన్‌ను కొట్టివేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అలాగే, ఆయనకు విధించిన శిక్షను రద్దు చేసేందుకు కూడా నిరాకరించింది. అయితే, ఆర్జీవీ కోర్టుకు హాజరై బెయిలుకు దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అనంతరం తదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేసింది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments