భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసీ ఉన్న టీ షర్టులు ధరించి పార్లమెంట్‌కు రాడంపై లోక్‌సభ స్పీకర్ బిర్లా (Lok Sabha Speaker Om Birla) అసహనం వ్యక్తం చేశారు. ఇలా చేయడం పార్లమెంటరీ నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ.. ఇకపై ఇలా చేయడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. కాగా ఈరోజు జరిగిన పార్లమెంట్ (Parliament) సమావేశాలకు కొందరు విపక్ష ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీషర్టులు వేసుకుని వచ్చారు. దీంతో సభను వాయిదా వేసి మరీ వారిని టీ షర్టులు మార్చుకుని రావాలని సూచించారు.
కేంద్రంలోని బీజేపీ తమిళనాడులోని డీఎంకే మధ్య నియోజకవర్గాల పునర్విభజన అంశంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే డీఎంకే సభ్యులు నినాదాలతో ఉన్న టీ షర్టులు ధరించి పార్లమెంట్‌కు రావడంతో స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ టి షర్టులపై ఇలా రాసి ఉంది. పునర్విభజన న్యాయబద్ధంగా జరగాలని.. తమిళనాడు పోరాడుతోంది, తమిళనాడు గెలుస్తోంది అనే నినాదాలు రాసీ ఉంది. ఇక సభలోకి వెళ్లిన ప్రతిపక్ష ఎంపీలు టీ షర్టుపై ఉన్న నినాదాలనే తమ మనసులోని భావాలుగా వెల్లడించారు.