భారత్ సమాచార్.నెట్, తెలంగాణ: ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ రెస్యూ ఆపరేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 16 రోజులుగా కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ టన్నల్ సహాయక చర్యల్లో (Rescue Operation) పురోగతి కనిపించింది. సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిలో ఆదివారం సాయంత్రం ఓ కార్మికుడి మృతదేహాన్ని రెస్యూ బృందాలు వెలికితీశాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో డెడ్ బాడీని గుర్తించిన రెస్యూ సిబ్బంది శిథిలాలు తొలగించి మృతదేహాన్ని బయటకు తీశాయి. ప్రమాద స్థలం నుంచి లోకో ద్వారా బాడీని టన్నెల్ బయటకు తీసుకొచ్చారు.
పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లో పంజాబ్‌కు తరలించారు. మరోవైపు టన్నెల్‌లో చిక్కుకుపోయిన మిగిత కార్మికుల కోసం సహయక బృందాలు గాలిస్తున్నాయి. కాగా తొలి మృతదేహం లభించిన చోటే.. మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించింది రెస్క్యూ బృందం. ఈ రెండు మృతేదేహాలను నేడు వెలికితీయనున్నారు. మరోవైపు గురుప్రీత్ మృతిపట్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా (ex-gratia) ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
ఇదిలా ఉంటే కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ తీసుకొచ్చిన తర్వాతే సహాయకచర్యల్లో పురోగతి కనిపించింది. కేరళకు చెందిన ఈ జాగిలాలు మట్టిలో 15 అడుగులు కింద ఉన్న మృతదేహాల ఆనవాళ్లను పసిగట్టగలవు. కాగా ఫిబ్రవరి 22న టన్నల్‌లో నీటి ప్రవాహం కారణంగా సొరంగం కూలిపోయింది. నల్గొండ జిల్లాకు తాగు, సాగు నీరు అందివ్వడానికి చేపట్టిన ప్రాజెక్టే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనల్ ప్రాజెక్ట్. సొరంగం ద్వారా 45 కీలో మీటర్లు కృష్ణా జలాలు తరలించనున్నారు. అందులో పని చేస్తున్న కార్మికుల్లో 8 మంది చిక్కుకుపోయారు. అప్పటి నుంచి అనేక రకాల బృందాలు వచ్చి వారిని రక్షించే ప్రయత్నాలు చేశాయి. అయినా ఫలితం దక్కలేదు.