భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: మార్చి నెల ప్రారంభం నుంచే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పొద్దున 8 గంటలకే సూర్యుడు యాక్షన్‌లోకి దిగిపోతున్నాడు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు మరింత తీవ్రంగా ఉండొచ్చని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేసింది. మధ్యాహ్నం సమయంలో చిన్నారులు, వృద్ధులు అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని.. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే రక్షణ చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 23 వరకూ స్కూళ్ల టైమింగ్స్ ఇలాగే కొనసాగనున్నాయి. టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రమే మధ్యాహ్నం పూట క్లాసులు నిర్వహించనున్నారు.
మరోవైపు ఏపీలోనూ భానుడి ప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. మార్చి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతుండడంతో.. మార్చి 15 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.