భారత్ సమాచార్, తిరుపతి ;
సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని వివరించారు.. ”ఏడుకొండల వారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా? నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. నాకు అన్యాయం జరిగితే బయటకు రాలేదు. తిరుమలలో అపచారం జరుగుతోంది.. సరిదిద్దండి అని గతంలో చెప్పా. పట్టించు కోలేదు. అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వేంకటేశ్వరస్వామి.. అంటూ వారాహి డిక్లరేషన్ గురించి చెప్పారు.
వారాహి డిక్లరేషన్ లోని అంశాలు:
1)ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం
వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి.
2) సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి.
3)సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి.
4)సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.
5)సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి.
6)ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి.
7)ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా మార్చాలి.
ఇతర మతాలను చూసి నేర్చుకోవాలి. సనాతన ధర్మానికి కొన్ని దశాబ్దాలుగా అవమానం జరుగుతూనే ఉంది. మనం గౌరవం ఇవ్వడంలేదు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే వచ్చా. డిప్యూటీ సీఎంగా, జనసేన అధినేతగా ఇక్కడికి రాలేదు. హిందువుగా.. భారతీయుడిగా ఇక్కడికి వచ్చా. భిన్నత్వంలో ఏకత్వం చూపేది సనాతనధర్మం. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే అవహేళన చేశారు. తిరుమలకు వెళ్తే నా కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించా. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా” అని పవన్ కల్యాణ్ అన్నారు..
లౌకికవాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారు..
”దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చాలా దాడులు జరిగాయి. రాముడిని తిడితే నోరెత్తకూడదు.. మనది లౌకికవాద దేశం అంటారు. ఇతర మతాల్లో వాళ్ల దేవుడిని తిడితే వదిలేస్తారా? లౌకికవాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదు? సనాతన ధర్మాన్ని సూడో సెక్యులరిస్టులు విమర్శిస్తున్నారు. సనాతన ధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించే వారు ఎక్కువయ్యారు. ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడవు. బంగ్లాదేశ్.. ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకున్నా ఎవరూ మాట్లాడరు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొంతమంది అనుకుంటున్నారు” అని పవన్ అన్నారు.