భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror attack) ప్రతీకారంగా భారత్ సైన్యం (Indian Army) పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ అనంతరం కొందరు పాక్ నటులు (Pak Actors) భారత్ ఆర్మీ చేసిన దాడిని తప్పుబడుతూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో సదురు నటీనటులు చేసిన వ్యాఖ్యలను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తీవ్రంగా ఖండించింది. వీరిని తక్షణమే సినీ పరిశ్రమ నుండి బహిష్కరించాలని పిలుపునిచ్చింది.
పాకిస్థాన్ నటులైన ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ ఆపరేషన్ సింధూర్‌పై స్పందిస్తూ.. మహీరా ఖాన్ భారత సైన్యం చర్యను ‘పిరికి చర్య’ అని అభివర్ణించగా.. ఫవాద్ ఖాన్ ఉగ్రవాదాన్ని ఖండించకుండా భారతదేశ వైఖరిని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి వ్యాఖ్యలు దేశాన్ని అవమానపరచడమే కాకుండా.. ఉగ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయిన అమాయకులను.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులను కూడా అవమానించేలా ఉన్నాయని పేర్కొంది.
అదేవిధంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేస్తున్న పాక్ కళాకారులు, చిత్రనిర్మాతలపై పూర్తిగా బ్యాన్ చేయాలని.. కళ పేరుతో ఇలాంటి కళాకారులకు గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అవమానపరచడమేనని అభిప్రాయపడింది. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారిని.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ తమ దేశానికి మద్దతు పలుకుతున్న పాకిస్థానీ కళాకారులకు భారతీయ కళాకారులు మద్దతు ఇవ్వడం సరికాదని హితవు పలికింది. అలాగే భారతీయ గాయనీగాయకులు ఎవరూ కూడా పాక్ నటీనటులతో కలిసి వేదికలు పంచుకోవద్దని కూడా సూచించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిలబడదామని పిలుపునిచ్చింది. కాగా ఇప్పటికే పాకిస్థానీ కళాకారులు, నిర్మాతలు, ఫైనాన్షియర్లపై ఏఐసీడబ్ల్యూఏ నిషేధం విధించింది.
Share This Post