భారత్ సమాచార్.నెట్, తిరుమల: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా నేడు అంటే ఆగస్ట్ 4 సోమవారం రోజున శ్రీవారి ఆలయంలో ఈ పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. రేపటి నుంచి ఆరంభం కానున్న ఈ ప్రవిత్రోత్సవాలు ఈ నెల 7 వరకు వైభవంగా జరగనున్నాయి. పవిత్రతోత్సవాల అంకురార్పణ సందర్భంగా నేడు సహసద్రీపాలకార సేవను టీటీడీ రద్దు చేసింది.
ఏడాది పొడవునా కోనేటి రాయుడు ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో భక్తుల వల్లగానీ.. సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. తెలిసి తెలియని ఈ దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కలుగకుండా ఉండేందుకు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తోంది టీటీడీ. కాగా తిరుమలలో 15, 16 శతాబ్దాల్లో జరిగిన పవిత్రోత్సవాలను.. 1962లో టీటీడీ పునరుద్ధరించింది.
ఇకపోతే పవిత్రోత్సవాల సందర్భంగా ఈ మూడు రోజులు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అలాగే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ మాడ వీధుల్లో సాయంత్రం విహరించనున్నారు. ఇక రేపు పవిత్రాల ప్రతిష్ట, ఎల్లుండి పవిత్ర సమర్పణ, చివరి రోజు అంటే ఆగస్ట్ 7 పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. మరోవైపు పవిత్రోత్సవాల సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవ, తిరుప్పావడ సేవతో పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.