Homemain slides‘‘అధికారం ఉంటే మర్డర్లు, దోపిడీలు చేస్తారా?’’

‘‘అధికారం ఉంటే మర్డర్లు, దోపిడీలు చేస్తారా?’’

భారత్ సమాచార్, రాజకీయం ; ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు… ఉపాధి చూపించే ప్రభుత్వం కావాలి. నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ల పేరుతో మోసం చేసే మాటలు కాదు.. నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది, ఉపాధి భరోసానిచ్చే కూటమి పాలన రావాలి. మహిళలపై అత్యాచారం జరిగితే అలాంటివి సాధారణం అని వెటకారంగా మాట్లాడే పాలకులు కాదు… మహిళలకు సంపూర్ణ భరోసానిచ్చే కూటమి సర్కారు రావాలి’’అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెద్దాపురం నియోజకవర్గం, సామర్లకోటలో జరిగిన వారాహి విజయభేరీ సభలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మెరుగైన, ఉన్నతమైన సుపరిపాలన తీసుకురావాలనే సంకల్పాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రజలు కూడా వారి బంగారు భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం వచ్చే ఎన్నికల్లో కూటమికి అండగా నిలబడాలనే సంకల్పాన్ని తీసుకోవాలని కోరారు.

కూటమి పార్టీలు ప్రకటించిన హామీలు అమలు సాధ్యం కాదని జగన్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అవినీతిని నిరోధించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తే హామీలు అమలు సాధ్యమేనని తెలిపారు.
మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ రూ.41వేల కోట్లు దోచుకున్నారు. ఇసుకలో వేలకోట్లు మింగేశారు. వాలంటీర్లకు సన్మానాల పేరుతో రూ.705 కోట్లు తగలేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి రూ. 13 వందల కోట్లు, ఆ రంగులు మళ్లీ తీయడానికి వెయ్యి కోట్లు ఖర్చు చేశారు. ఇలాంటివన్నీ అరికడితే హామీలు అమలు పెద్ద కష్టం కాదన్నారు. “2024 సార్వత్రిక ఎన్నికలు మన దేశ, రాష్ట్ర భవిష్యత్తుకు చాలా కీలకం. ఒకటికి పదిసార్లు ఆలోచించి యువత, మహిళలు, పెద్దలు ఓట్లు వేయాలి. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అనుకునే వ్యక్తిని నేను. అందరికీ సమ న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాను. శెట్టిబలిజలపై తొమ్మిది వేలకుపైగా అక్రమ కేసులు బనాయించారని తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ కేసులను ఎత్తి వేస్తాం’’ అని అన్నారు.

రాష్ట్రం బాగుండాలి అనే ఆలోచనే తప్ప… స్వార్థం లేదు

నేను ఏనాడూ కూడా నా స్వార్ధం కోసం ఆలోచించలేదు. రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని మాత్రమే ఆలోచిస్తాను. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడి ని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. ఆ సమయంలో నా స్థానంలో ఎవరున్నా… నేను ఎదగాలి, నా పార్టీ ఎదగాలి అని ఆలోచిస్తారు. కానీ నేను అలా ఆలోచించలేదు. రాష్ట్రం బాగుండాలని అని ఆలోచించి రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయన్ను కలిసి మద్దతు ప్రకటించాను. రాష్ట్రం బాగుండాలి అంటే ఒక నాయకత్వం సరిపోదు. చాలా మంది నాయకుల అనుభవం కావాలి. అన్ని లోతుగా ఆలోచించి కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి భుజం కాశాము. ఒంటరిగా వెళ్తే 50 స్థానాలు పోటీ చేయోచ్చు… కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మమ్మల్ని మేము తగ్గించుకొని త్యాగాలు చేశాము. వైసీపీ లాంటి అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే మూడు పార్టీలు కలవాల్సిందే.

వెయ్యి కోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించాడు

కాకినాడ రూరల్ శాసనసభ్యుడు కురసాల కన్నబాబుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతూ, నలుగుతున్నానంటే దానికి ఒకానొక కారణం కన్నబాటే. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మూల కారకుడు ఆయన. డొక్కు స్కూటర్ మీద తిరిగిన వ్యక్తి ఈ రోజు వెయ్యి కోట్లకు అధిపతి అయ్యాడు. ఒక నాయకుడు అంచెలంచెలుగా ఎదిగితే తప్పు లేదు. నమ్మినవారినే నలిపేసి ఎదగకూడదు. నియోజకవర్గం పరిధిలో రూ.20 కోట్ల విలువైన 4.86 ఎకరాల భూమిలో లే అవుట్ వేశారు. ఈ లేఅవుట్ లో 20 మంది స్థలాలు కొనుగోలు చేశారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాల్లో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. డాక్టర్ కిరణ్ చౌదరి అనే వ్యక్తి దగ్గర ఇలానే ఆస్తులు రాయించుకొని వేధించారు. చివరకు ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశారు.

కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పిన వ్యక్తి జగన్

వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీలనే కాకుండా అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 27 పథకాలను తొలగించిందని విమర్శించారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరును తొలగించిందని గుర్తు చేశారు. ఒక ఎమ్మెల్సీ అయితే దళితుడు అయిన తన మాజీ డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశాడన్నారు. అధికారం ఉంది కదా అని మర్డర్లు, దోపిడీలు చేస్తామంటే ఎలా..? అని ప్రశ్నించారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి వైసీపీ తరపున చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదన్నారు. ఐదేళ్లకోసారి పార్టీ మారుతుంటారు, ఒక పార్టీనే నమ్ముకొని ఉండనోడు… రేపు మీకేమి న్యాయం చేస్తాడన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని జగన్ ఖరాకండిగా చెప్పాడన్నారు. అప్పుడు కన్నబాబు కూడా జగన్ పక్కనే ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలా అన్ని వర్గాలను వైసీపీ నాయకులు మోసం చేశారన్నారు. వీళ్లకు ఓట్లు అడిగే అర్హత కూడా కోల్పోయారన్నారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి కూటమి అభ్యర్ధిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ శాసనసభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పంతం నానాజీ పోటీ చేస్తున్నారన్నారు. వీరిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

మరికొన్ని రాజకీయ సంగతులు…

బాబాయ్ కోసం మెగా ప్రిన్స్ ప్రచారం

RELATED ARTICLES

Most Popular

Recent Comments