భారత్ సమాచార్.నెట్: హిందీ భాషపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మన మాతృభాష అమ్మ అయితే.. హిందీ మన పెద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం జరిగిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకల్లో హిందీని రాష్ట్ర భాషగా సమర్థిస్తూ దాని ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. హిందీని రాష్ట్ర భాషగా అభివర్ణించారు. విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకు వెళ్తున్న తరుణంలో.. ఇతర భాషలను వ్యతిరేకించడం సరికాదన్నారు. ఇతర భాషలను వ్యతిరేకిండం.. రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందన్నారు. హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదని.. మరింత బలపడటం అని పేర్కొన్నారు.
మన మాతృభాషన్ని గౌరవించాలని.. హిందీని పెద్దమ్మగా భావించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. హిందీని ప్రేమిద్దాం.. మనదిగా భావిద్ధామన్నారు. హిందీని నేర్చుకోవడం ద్వారా భారతీయులు మరింత బలపడతారని.. ఇది జాతీయ సమైక్యతకు దోహదపడుతుందన్నారు. దేశంలో ఎక్కువ శాతం ప్రజలు హిందీనే మాట్లాడుతారని.. అలాంటి హిందీ భాషను నేర్చుకుంటే నష్టం ఏం జరగదన్నారు. హిందీని కొందరు రాజకీయ అస్త్రంగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు.