Homebreaking updates newsతిరుపతిలోనే పవన్ కళ్యాణ్ అన్నప్రాసన జరిగింది

తిరుపతిలోనే పవన్ కళ్యాణ్ అన్నప్రాసన జరిగింది

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

దీక్షలు తీసుకోవడం మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి అలవాటే. అయ్యప్పస్వామి మాల వేసుకునేవాడు. ‘అయ్యప్ప దర్శనానికి నేను వెళ్లాలి నాన్నా..’ అని ఒకసారి అడిగితే నా కోసం అయ్యప్పస్వామి మాల వేసుకున్నాడు. 40 రోజుల తర్వాత వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాం’ అని జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనాదేవి తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, జీవన శైలి, ఆధ్యాత్మిక చింతన లాంటి విషయాలు తెలుపుతూ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

ప్రశ్న: అమ్మా… సినీ కళామతల్లికి ముగ్గురు స్టార్స్ ని ఇచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తయ్యింది. దీన్ని మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు?

-ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు అంత సుఖం వచ్చింది. ఇప్పుడు ఇంకా బాధ్యత ఎక్కువ అయ్యింది.

ప్రశ్న: మీ ఇంటి చిన్నబ్బాయి రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్నయ్య అయ్యారు…

– చాలా సంతోషంగా ఉంది. ఎంత కష్టపడ్డాడో బిడ్డకు భగవంతుడు అంత మంచి అదృష్టం ఇచ్చాడు. ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది.

ప్రశ్న: జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికి పదేళ్లు గడిచింది. ఈ పదేళ్లలో ఇంటికి దూరంగా.. పీక్ లో ఉన్న కెరీర్ ను పక్కనపెట్టి రాత్రింబవళ్లు ప్రజల్లో ఉంటూ.. నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. తాగు నీరు కూడా దొరకని పాడేరు లాంటి ప్రాంతాల్లో తిరిగారు. అంత కష్టపడుతుంటే మీకు ఏమనిపించింది?

అలా తిరుగుతుంటే ఒక తల్లిగా బాధ కలిగింది.. అయితే ఇంట్లో అయినా అలాగే ఉంటాడు. ఎక్కడైనా పడుకుంటాడు. షూటింగులు చేసి వచ్చి సోపాల మీద పడుకుని నిద్రపోయేవాడు. గదిలోనే పడుకోవాలి అని ఎప్పుడూ లేదు. కష్టపడతాడు. ఎంత కష్టపడినా ‘ఇంత కష్టపడ్డాను’ అని ఏనాడు చెప్పేవాడు కాదు. బిడ్డ అంత కష్టపడుతున్నాడే అని నాకు మాత్రం చాలా బాధగా ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా ఏమీ అడిగేవాడు కాదు. చిన్నప్పుడు కామ్ గా ఉండేవాడు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. భోజనానికి రమ్మని పిలిచినా వచ్చే వాడు కాదు. అంతా వచ్చిన తర్వాత ఆలస్యంగా వచ్చేవాడు. ఇది కావాలి.. అది కావాలి అని అడిగేవాడు కాదు.

ప్రశ్న: పవన్ కళ్యాణ్ గారికి మీ చేతి వంటలో ఏది ఎక్కువ ఇష్టం?

– పలావు అంటే బాగా ఇష్టం. ఏదైనా తింటాడు. పలావు అంటే కొంచం ఎక్కువ ఇష్టం. ఏదైనా చేసిపెడితే తినేవాడు తప్ప ఇది కావాలి. అది కావాలి అని అడిగేవాడు కాదు. ఏమీ అడగడు అని నేనే చేసి పెట్టేదాన్ని. చిన్నప్పటి నుంచి అంతే ఏమీ అడిగేవాడు కాదు.

ప్రశ్న: ఓ టీవీ ఇంటర్వూలో చూశాను.. చిన్నప్పడు ఇంట్లో టీవీఎస్ అడిగితే కొనిపెట్టలేదు. అందుకే ఇప్పుడు బైకులు ఎక్కువగా కొంటున్నాను అని చెప్పారు. నిజమేనా?

-ఆ విషయం నాకు తెలియదు.

ప్రశ్న: ప్రజలంతా బాగుండాలన్న కాంక్షతో పవన్ కళ్యాణ్ ఎక్కువగా శ్రీ నరసింహస్వామి క్షేత్ర దర్శనాలు, వారాహి అమ్మవారి దీక్షలు, ఇప్పుడు శ్రీ వెంకటేశ్వరస్వామి క్షేత్రంలో జరిగిన లడ్డూ వ్యవహారంలో కూడా ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. 11 రోజుల పాటు ఈ దీక్ష చేట్టారు. దీన్ని మీరలా చూస్తారు?

-దీక్ష చేయడం మంచిదే. శ్రీ వెంకటేశ్వరస్వామి దీక్ష తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. దీక్షలు తీసుకోవడం మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి అలవాటే. అయ్యప్పస్వామి మాల వేసుకునేవాడు. చిన్నతనంలో దైవ భక్తి ఉండేదిగాని దేవుడి దగ్గర దండాలు పెట్టేసి పూజలు చేసేవాడు కాదు. వాళ్ల నాన్న గారు పూజ చేసినా ప్రసాదం మాత్రమే తీసుకునేవాడు. ఇప్పుడు పెద్దయ్యాక పూజలు చేస్తున్నాడు.

ప్రశ్న: తిరుమలలో యోగ నారసింహస్వామి గుడి ఉంది కదా.. పవన్ కళ్యాణ్ అన్నప్రాసన అక్కడే జరిగిందని విన్నాము. అందుకు సంబంధించిన వివరాలు చెబుతారా?

– మేము ఒకసారి తిరుపతి దర్శనానికి వెళ్లాము. అప్పటికి కచ్చితంగా మా అబ్బాయికి ఆరో నెల వచ్చింది. ఆరో నెల వచ్చింది కదా ఇక్కడే అన్నప్రాసన చేసేద్దామని నాకు మనసులో అనిపించింది. వెంకట్రావు పోలీసు అవడం వల్ల ఆ రోజుల్లో ఆయన దగ్గర ఎప్పుడూ చిన్నపాటి కత్తి ఉండేది. ఆ కత్తి, పెన్ను, పుస్తకాలు, దేవుడి ప్రసాదం పెట్టి యోగ నరసింహస్వామి వద్ద పడుకోబెట్టి చేసేద్దామండి అన్నాను. అంతకంటే అదృష్టం ఏముందని ఆయన అన్నారు. అన్నప్రాసన చేస్తే పవన్ ముందు కత్తి పట్టుకున్నాడు. తర్వాత పెన్ను పట్టుకున్నాడు.

ప్రశ్న: కత్తి పట్టుకోవడాన్ని ఎలా తీసుకున్నారు?

కత్తి పట్టుకున్నాడు కదా పిల్లాడు కోపిష్టి అవుతాడు లేదంటే పది మందికీ ఏదో చేస్తాడు అని అప్పుడే అనుకున్నాను. కత్తిపట్టుకున్నాడు ఏదో చేస్తాడనుకున్నా.

ప్రశ్న: తర్వాత పెన్ను పట్టుకున్నదానికి ఏమనుకున్నారు?

-పెన్ను పట్టుకున్నది రెండోసారి కదా. ప్రజల కోసం కష్టపడి పని చేస్తాడు అనుకున్నాను. వాళ్ల నాన్న బాగా టూర్స్ వెళ్ళేవారు. ఆయన గుణాలే మా అబ్బాయికి ఉన్నాయి. కొంచం తిరగడం, కోపం ఆయనకి కూడా ఉండేవి.

ప్రశ్న: పవన్ కళ్యాణ్ తండ్రి గారైన వెంకట్రావు ప్రభావం చిన్నప్పటి ఆయనపై ఉండేదా?

-చిన్నప్పటి నుంచి వాళ్ల నాన్నతో ఎక్కువగా ఉండేవాడు. వాళ్ల నాన్న లా బుద్ధిగా ఉంటాడు. తిండి గురించి ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు. ఎక్కువగా మాట్లాడడు, మితభాషి. అందుకే వాళ్ల నాన్నకి ఈ కొడుకు అంటే కొంచం ఎక్కువ ఇష్టం. అలా అని మిగతావాళ్ల మీద లేదు అని కాదు. చిన్నబ్బాయి ఇంట్లో కొంచం కామ్ గా ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. మాట్లాడితే మా చిన్నమ్మాయితో మాట్లాడేవాడు. ఈయన కంటే చిన్నది కాబట్టి ఆమెతో మాట్లాడేవాడు.

ప్రశ్న: అమ్మా చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పుస్తకాలు ఎక్కువ చదువుతూ ఉండేవారా?

– స్కూలులో ఎక్కువ లేదు. 10వ తరగతికి వచ్చేసరికి వాళ్లన్నయ్య క్లాస్మేట్ కి బుక్ లైబ్రరీ ఉంటే అక్కడికి వెళ్లి ఎక్కువ చదువుకునేవాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే చదువుకోవడానికి అనేవాడు అంతే. అలా పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది. ఇప్పటికి కూడా చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ఇంట్లో పెట్టుకుని చదువుతున్నాడు. వాళ్ల నాన్న పుస్తకాలు చదివేవారు. వాళ్ల నాన్న అలవాట్లే వచ్చాయి. ఇప్పుడు ఇంట్లో చూస్తే ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ చదివే ఇన్ని ఆలోచనలు వచ్చాయేమో అనుకునేదాన్ని.

ప్రశ్న: పెద్దయ్యాక ఆయన ఏమవుతారో చిన్నప్పుడే ఏమైనా అనుకున్నారా?

– నేను ఎవరి గురించి ఇది కావాలి. అది కావాలి అని అనుకోలేదు. వాళ్ల వాళ్ల అదృష్టాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది.

ప్రశ్న: పవన్ కళ్యాణ్ కి ఇంట్లో ఎవరితో ఎక్కువ అనుబంధం ఉండేది? చిరంజీవి తోనా? మిగిలినవాళ్లతోనా?

– చిన్నప్పుడు వాళ్ల అన్నయ్యే బాగా దగ్గర తీసేవాడు. చిన్నవాడు కదా వాళ్లన్నయ్య ఎత్తుకుని ఫోటోలు తీసుకోవడం లాంటివి చేసేవాడు. తమ్ముడిని చాలా బాగా చూసుకునేవాడు. రెండో ఆయనకు ప్రేమ ఉన్నా మామూలుగానే ఉండేవాడు. ఎక్కువ చేరదీసింది మాత్రం పెద్ద కొడుకే. ఆయనతోనే ఎక్కువ ఉండేవాడు. ఇప్పటికీ వాళ్లన్నయ్య, వదినతోనే ఉంటాడు. మేము నెల్లూరులో ఉండేవాళ్లం. మాకు ఎక్కువగా ట్రాన్స్ ఫర్లు అయ్యేవి. పిల్లల చదువులు సరిగ్గా ఉండవని కళ్యాణ్ బాబుని తీసుకువెళ్లి చదివిస్తాను అని చెప్పి మద్రాసు తీసుకువెళ్లిపోయాడు.

ప్రశ్న: పవన్ కళ్యాణ్ కి మీరు చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణేనా?

కాదు. శ్రీ కళ్యాణ్ కుమార్ అని పెట్టాం. అది వెంకటేశ్వరస్వామి పేరు.

మరికొన్ని వార్తా విశేషాలు

అమరావతిలో సినిమా స్టూడియో నిర్మాణం?

RELATED ARTICLES

Most Popular

Recent Comments