భారత్ సమాచార్.నెట్:గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకుంది. ఈ విమానం ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో అనేకమంది అక్కడికక్కడే మరణించగా.. పలువురికి గాయాలు అయ్యాయి. తక్షణమే రంగంలోకి దిగిన అత్యవసర బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. సాధ్యమైనంత వరకు ప్రమాద తీవ్రతను అదుపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అహ్మదాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలోనే ప్రమాదం చోటు చేసుకొంది. ఎయిరిండియాకు చెందిన విమానం లండన్ వెళ్లేందుకు ఈ మధ్యాహ్నం బయలు దేరింది. గాలిలోకి ఎగిరిన కొద్ది సేపటికే ప్రమాదం చోటు చేసుకొంది. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు పైలట్లు, పది మంది విమాన సిబ్బంది అందులో ఉన్నారు. విమాన పైలట్స్ ఇద్దరూ చాలా సీనియర్లు అని వెయ్యి గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉందని చెబుతున్నారు.
ముందుగానే విమానానికి అన్ని తనిఖీలు చేసి పంపించారని సమాచారం. విమానం బయలు దేరిన కొద్ది సేపటికే విమానాశ్రయంలోని కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలోనే పైలట్లు కొంత మేర హెచ్చరికలు చేశారని చెబుతున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే విమానం అదుపు తప్పటంతో చుట్టుపక్కల జనావాసాల మీదకు దూసుకొని వెళ్లిపోవడం జరిగింది. విమానం ప్రమాదానికి గురి కావటానికి కొన్ని నిమిషాల ముందు దృశ్యాలు చూస్తుంటే.. విమానాన్ని కాపాడేందుకు పైలట్లు చివరి నిమిషం వరకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
సహజంగానే ఇంటర్నేషనల్ విమానాలు భారీ స్థాయి ట్యాంకర్‌ను కలిగి ఉంటాయి. లండన్ దాకా నాన్ స్టాప్ విమానం కావటంతో అక్కడ దాకా ప్రయాణించేందుకు అవసరం అయిన ఇంధనాన్ని పూర్తి స్తాయిలో నింపినట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ప్రమాద తీవ్రతను మరింత పెంచినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా విమానం కుప్పకూలగానే, ఆ ఒరిపిడికి ట్యాంకర్లకు నిప్పు అంటుకున్నట్లు తెలుస్తోంది. భారీగా ఇంధనం ఉండటంతో విమానం మంట్లో చిక్కుకుంది. అయితే విమానం జనావాసాల్లో కుప్పకూలడం కూడా ప్రమాద తీవ్రతను మరింత పెంచింది. అక్కడ ప్రజానీకం కూడా మంటల్లో చిక్కుకున్నారు.
ప్రమాద సంఘటన తెలియగానే అహ్మదాబాద్ విమానాశ్రయం తక్షణం స్పందించింది. ఫైర్ ఇంజన్లను పెద్ద సంఖ్యలో అక్కడకు తరలించింది. మంటల్ని ఆర్పేందుకు తక్షణ ప్రాధాన్యతగా పెట్టుకొని జాగ్రత్త చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
Share This Post