భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణా (Tahawwur Hussian Rana)ను అమెరికా భారత్‌కు అప్పగించింది. ఈ క్రమంలోనే అతడ్ని గురువారం సాయంత్రం ఢిల్లీకి తీసుకొచ్చారు భారత్ అధికారులు. అయితే రాణాను గత రాత్రి ఎన్ఐఏ (NIA) అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు (Patiala house court) ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఎన్ఐఏ తరపున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ వాదనలు వినిపించారు. రాణా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్‌దేవా వాదించారు.
అయితే రాణాను తమకు 20 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎన్ఐఏ కోరింది. వాదనల అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చందర్‌జీత్ సింగ్ 18 రోజుల కస్టడీ (NIA Custody)కి అనుమతించారు. అనంతరం రాణాను ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలించారు. దాడి వెనక ఉన్న కుట్రను ఛేదించడానికి రాణాను ప్రశ్నిస్తామని ఎన్ఐఏ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో తహవ్వుర్ రాణా గురించి గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేసిన ట్వీట్ (Old Tweet) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.
2011లో ఈ కేసుకు సంబంధించి అమెరికా కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ముంబై ఉగ్రదాడుల్లో రాణా ప్రత్యక్ష పాత్ర లేదని స్పష్టం చేసింది. కానీ, ఆ దాడులకు కారణమైన ఉగ్ర సంస్థకు మద్దుతు ఇచ్చినందుకు రాణాను దోషిగా తేల్చింది. అయితే ఆ తీర్పుపై స్పందిస్తూ 2011 జూన్ 10న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ దౌత్య విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ నాడు గుజరాత్ సీఎం హోదాలో మోదీ పోస్ట్ చేశారు. ‘ముంబై ఉగ్రదాడిలో తహవ్వుర్ రాణాను నిర్దోషిగా యూఎస్ ప్రకటించడం భారత సార్వభౌమత్వాన్ని అవమానించడమే. ఇది విదేశాంగ విధానానికి భారీ ఎదురుదెబ్బ’ అని మోదీ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం రాణాను భారత్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ పోస్ట్‌ను షేర్ చేస్తూ నెటిజన్లు ప్రధాని మోదీ దౌత్య విధానాలను ప్రశంసిస్తున్నారు. తహవ్వుర్‌ను తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం భారీ విజయాన్ని సాధించారని కామెంట్స్ చేస్తున్నారు. చెప్పినట్టే చేసే నాయకుడని, ప్రధాని మోదీకి ఏదైనా సాధ్యమే అంటూ మరి కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా రాణాను భారత్‌కు అప్పగించడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పగించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే.