భారత్ సమాచార్.నెట్: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు జాతీయ మీడియాలు కథనాలు పేర్కొంటున్నాయి. మోదీ చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కూడా చర్చలు జరపనున్నట్లు సమాచారం.
ఆగస్ట్ చివరిలో ప్రధాని మోదీ అక్కడి వెళ్లనున్నారు. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు తియాంజిన్ వేదికగా నిర్వహించనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఈ సదస్సులో మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా ఇతర దేశాధినేతలు కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా, 2020 తర్వాత చైనాకు ప్రధాని మోదీ వెళ్లడం ఇదే తొలిసారి.
2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లలేదు. 2015లో తొలిసారిగా ప్రధాని మోదీ చైనా రాజధాని బీజింగ్‌ను సందర్శించారు. ఇప్పటివరకు ప్రధాని మోదీ ఐదుసార్లు చైనాలో పర్యటించారు. అయితే, 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు.. ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
Share This Post