భారత్ సమాచార్.నెట్: భారత్‌ను మిత్రదేశం అంటూనే మన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ అవతరించబోతోందని ప్రధాని పేర్కొన్నారు. కాబట్టి మన ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ట్రంప్ టారిఫ్‌ల వేళ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని పిలుపునివ్వడం ప్రధాన్యం సంతరించుకున్నాయి. రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కనబెట్టి స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుంబిగించాలన్నారు. స్వార్థాన్ని పక్కనపెట్టి దేశ ప్రయోజనాల కోసం కృషి చేయాలన్నారు. భారత్ తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇకపోతే భారత్ రష్యా రీలేషన్‌పై ఇటీవల ట్రంప్ స్పందిస్తూ.. రెండు దేశాలు కలిసి వారి డెడ్ ఎకానమీలను మునగనీయండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చేయడం ట్రంప్‌కు అసలు మింగుడుపడటం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే అదనంగా పెనాల్టీలు వసూలు చేస్తామని బెదిరింపులకు దిగిన.. భారత్ ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోవడం లేదు.