భారత్ సమాచార్.నెట్: ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్రినిడాడ్ అండ్ టొబొగోలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో పియార్కో అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయ వస్త్రధారణతో ట్రినిడాడ్ ప్రధాని కమలా పెర్సాద్ బిస్సెసార్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. సైనికుల వందనంతో పాటు భారతీయ పౌరాణిక పాత్ర ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రధాని మోదీని ఆహ్వానించారు.
అయితే ఎయిర్ పోర్టు నుంచి దారి పొడవునా పెద్ద సంఖ్యలో భారతీయులు పాల్గొని భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. అలాగే భోజ్‌పురి చౌతాల్ సంగీతంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారి అభిమానానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. ఇందులో ‘ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన భారతీయులు.. అనేక రంగాల్లో రాణిస్తూ ట్రినిడాడ్ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే భారతదేశంతో తమకున్న బంధాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం గర్వంగా ఉంది.’ అని ట్వీట్ చేశారు.
పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. ట్రినిడాడ్ ప్రధాని కమలాను భారత్ బీహార్ కుమార్తెగా భావిస్తుందన్నారు. ఈ దేశంలో చాలామంది అక్కడి మూలాలున్న వాళ్లే ఉన్నారన్నారు. బీహార్ వారసత్వం భారత్‌కే కాదు.. ప్రపంచానికి గర్వకారణమన్నారు. ప్రజాస్వామ్యం, రాజకీయం వంటి వాటిలో దశాబ్ధాల క్రితమే బీహార్ ప్రపంచానికి కొత్తదశను చూపించిందన్నారు. 21వ శతాబ్ధంలోనూ అది కొనసాగుతోందని భావిస్తున్నానని మోదీ అన్నారు. కాగా1999 తర్వాత ట్రినిడాడ్ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.