July 28, 2025 5:35 pm

Email : bharathsamachar123@gmail.com

BS

PM Modi: తెలంగాణలోని ఆ ప్రాంత మహిళలను అభినందించిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?

భారత్ సమాచార్.నెట్: భారత్ ట్రకోమా రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత్ ట్రకోమా రహిత దేశంగా మారడంలో కృషి చేసిన వైద్యులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలు సహా అందరికీ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఆదివారం ప్రసారమైన 123వ మన్‌కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే పలు అంశాలపై మాట్లాడిన ప్రధాని మోదీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాంశు శుక్లాకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మన్‌కీ బాత్‌లో ప్రధాని మాట్లాడుతూ.. మిల్లెట్‌ బిస్కెట్లు తయారు చేస్తున్న తెలంగాణలోని భద్రాచలం ప్రాంత మహిళలను అభినందించారు ప్రధాని మోదీ. ‘భద్రాద్రి మిల్లెట్‌ మ్యాజిక్‌’ పేరిట బిస్కెట్లు తయారు చేస్తున్నారని, అవి హైదరాబాద్‌ నుంచి లండన్‌కు ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. అలాగే ఈ నెల 21న జరిగిన యోగా డే కార్యక్రమాల్లో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పాల్గొన్నారని గుర్తుచేశారు. దాదాపు పదేళ్ల క్రితం మొదలైన కార్యక్రమం ఏటా మరింత విస్తరిస్తోందన్నారు. చాలామంది ప్రజలు యోగాను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

అలాగే దేశం గతంలో ఎదుర్కొన్న ఎమర్జెన్సీ పరిస్థితిని గుర్తు చేశారు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం దేశంలో విధించిన ఎమర్జెన్సీ ద్వారా రాజ్యాంగాన్ని హత్య చేయడమే కాకుండా న్యాయవ్యవస్థను కూడా గెలిపించుకునే ప్రయత్నం జరిగిందని తీవ్రంగా విమర్శించారు. అప్పట్లో నేత జార్జి ఫెర్నాండెజ్‌ను సంకెళ్లతో బంధించారని చెప్పారు. అయితే భారత ప్రజల ప్రజాతంత్ర విశ్వాసంతో ఎమర్జెన్సీకి తెరపడిందని, ఆ నిర్ణయం తీసుకున్న వారు ఓడిపోయారని మోదీ అన్నారు. అంతేగాక, మోరార్జీ దేశాయ్, వాజ్‌పేయి, బాబూ జగ్జీవన్ రామ్ లాంటి నేతల ప్రసంగాలను గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడిన వీరుల త్యాగాలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.

బోడోల్యాండ్ ప్రాంతానికి చెందిన యువ ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. పరిమిత వనరుల మధ్య తాము ప్రదర్శించిన ప్రతిభ ప్రశంసనీయమని అన్నారు. ఈ ఆటగాళ్లు దేశంలోని చిన్నారులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అదేవిధంగా ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఫిట్‌నెస్, ఆరోగ్యం దృష్ట్యా ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేకాదు మేఘాలయకు చెందిన ఎరీసిల్క్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించిన విషయాన్ని వెల్లడించారు. దీనిలో పురుగులను చంపకుండా వస్త్రాన్ని తయారు చేయడం దీని ప్రత్యేకతగా ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలోని బౌద్ధ క్షేత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపును వివరించారు.

Share This Post
error: Content is protected !!