July 28, 2025 12:24 pm

Email : bharathsamachar123@gmail.com

BS

వక్ఫ్ బిల్లుకు ఆమోదం.. ఇదో చారిత్రక ఘట్టం

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన.. రాజకీయంగా విపక్షాలు, అధికార పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన వక్ఫ్ (సవరణ) బిల్లు (Waqf Amendment Bill) 2025కు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. బిల్లుపై లోక్‌సభ (Loksabha) ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 288, ప్రతికూలంగా 232 ఓట్ల రావడం బిల్లు ఆమోదం పొందింది. ఇక రాజ్యసభ (Rajyasabha)లో బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీంతో వక్ఫ్ (సవరణ) బిల్లుకు పార్లమెంట్ (Parliament) ఉభయసభలు ఆమోదం తెలిపినట్లు అయింది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025ను కేంద్ర ప్రభుత్వం “యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్” అనే పేరుతో అభివర్ణించింది.

ఇక ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఆమోదం కోసం పంపనున్నారు. ప్రెసిడెంట్ ఆమోదం తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు చట్టంగా రూపాంతరం చెందనుంది. ఇక పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించడంపై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఇదో చరిత్రాత్మక మలుపు అని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్‌ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్న ప్రధాని.. తాజాగా ఆమోదం పొందిన ఈ బిల్లుతో ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేయబడిన అణగారిన వర్గాలకు మేలు చేకూరుతుందని.. వారి గళం వినిపించేందుకు అవకాశం దక్కుతుందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం థాయిలాండ్‌లో బిమ్‌స్టెక్ సమావేశానికి హాజరైన ప్రధాని, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “వక్ఫ్ సవరణ బిల్లు మరియు ముస్లింల వక్ఫ్ (ఉపసంహరణ) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం ఓ చారిత్రక ఘట్టం. ఇది సమాజంలో సమానత, పారదర్శక పాలన, సంపూర్ణ వృద్ధి దిశగా మన సమిష్టి ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు. ఈ చట్టాన్ని రూపుదిద్దడంలో సహకరించిన కమిటీ సభ్యులు, చర్చల్లో పాల్గొన్న పార్లమెంటరీ సభ్యులు అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే, బిల్లుకు సంబంధించిన సవరణల కోసం విలువైన సూచనలు పంపిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

Share This Post
error: Content is protected !!