భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 81 ఏళ్ల వయసులో సోమవారం ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం శిబు సోరెన్ భౌతికకాయం ఢిల్లీలోనే ఉండడంతో.. ప్రధాని మోదీ ఆస్పత్రికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. తండ్రి శిబు సోరెన్ భౌతికకాయం వద్దనే ఉన్న ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, వారి కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. కన్నీళ్లు పెట్టుకుంటున్న హేమంత్ సోరెన్‌ను ప్రధాని మోదీ ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఇకపోతే జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేశారు శిబు సోరెన్. 1972లో గిరిజనుల హక్కుల కోసం, వారి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడేందుకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో ఆయన విజయం సాధించి జార్ఖండ్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా పనిచేసనిప్పటికీ.. పూర్తి కాలం పాలించలేకపోయారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఆయన బొగ్గు శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.