భారత్ సమాచార్.నెట్: ఐపీఎల్‌లో(IPL) రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తరఫున ఆడిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vvaibhav Suryavanshi)పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రశంసలు కురిపించారు. తన చిన్న వయసులోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బీహార్ వేదికగా జరగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్(khelo india youth games)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ప్రధాని మోదీ వైభవ్‌ను కొనియాడారు.
ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. చిన్న వయసులోనే ఇలా రాణించడం గొప్ప విషయం. అతని విజయాల వెనక ఉన్న కృషి అభినందనీయం. వివిధ స్థాయిల్లో మ్యాచ్‌లు ఆడటం వైభవ్‌కు సాయపడింది. ఎక్కువగా ఆడే వారికి రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ కొనియాడారు. క్రీడల రంగానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందనేదాన్ని ప్రధాని వివరించారు.
కొత్త క్రీడలకు అవకాశాలు కల్పించేందుకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో గట్కా, ఖోఖో, మల్కాంబ్, యోగాసన వంటి ఆటలను చేర్చినట్లు తెలిపారు. ఇప్పుడు యువ అథ్లెట్లు వుషు, లాన్ బాల్స్, రోలర్ స్కేటింగ్ వంటి క్రీడల్లోనూ ప్రతిభ చూపుతున్నారని అన్నారు. ఇకపోతే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్‌లోని పాట్నా, రాజ్‌గిర్, గయా, భగల్‌పూర్, బెగుసరాయ్ నగరాల్లో జరుగనున్నాయి. అలాగే ఢిల్లీ వేదికగా షూటింగ్, జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.