భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack), ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తొలిసారిగా విదేశీ పర్యటన (Foreign Visit)కు సిద్ధమయ్యారు. రేపటి నుంచి మూడు రోజులపాటు కెనడా (Canada)లో జరగనున్న జీ 7 సదస్సు (G7 Summit)లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. జీ 7 సదస్సులో పాల్గొనేందుకు రేపు ఢిల్లీ నుంచి బయలు దేరి వెళ్తారని పేర్కొంది. కేవలం కెనడాకే కాకుండా.. ప్రధాని మోదీ సైప్రస్, క్రొయేషియా దేశాలను కూడా సందర్శించనున్నట్లు తెలిపింది.
జూన్ 16, 17 తేదీల్లో కెనడాలోని కననాస్కిస్‌లో జరగబోయే జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు. జూన్ 15 నుంచి 16 వరకు ప్రధాని మోదీ సైప్రస్ పర్యటనలో పాల్గొంటారు. అనంతరం జూన్ 16 నుంచి 17 వరకు జీ-7 సదస్సులో హాజరై, ఆ తర్వాత జూన్ 18న క్రొయేషియా పర్యటనను కొనసాగించనున్నారు. అయితే ఈ సమావేశంలో ఇంధన భద్రత, సాంకేతిక పురోగతులు, ఆవిష్కరణలు వంటి ముఖ్యమైన అంతర్జాతీయ అంశాలపై భారత్ వైఖరిని మోదీ స్పష్టంగా తెలియజేయనున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అలాగే ఇటీవల పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ చర్చించనున్నట్లు సమాచారం. కాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా జీ 7 సదస్సుకు ఆహ్వానించ ఫోన్ ద్వారా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన తర్వాత భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రెండు దేశాలను దూరం చేశాయి. ఆ ఉదంతం తరువాత ప్రధాని మోదీ కెనడా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.
Share This Post