భారత్ సమాచార్.నెట్: జమ్మూకశ్మీర్ (Jammu & Kashmir)లోని పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్రంగా స్పందించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న శక్తులకు ఊహకు కూడా అందని రీతిలో శిక్షిస్తామంటూ ప్రధాని మోదీ స్పష్టం చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బిహార్ (Bihar) రాష్ట్రం మధుబనిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా పహల్గామ్‌లో ఏప్రిల్ 22న చోటుచేసుకున్న ఉగ్రదాడిని ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. దాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ కష్ట కాలంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తోందని ప్రధాని భరోసా ఇచ్చారు. గాయపడిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తోందని తెలిపారు. ఈ దాడి కారణంగా ఓ తల్లి తన కొడుకును.. ఓ సోదరి తన భర్తను శాశ్వతంగా కోల్పోయిందని విచారణ వ్యక్తం చేశారు.
దేశం అంతటా, కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరిలోనూ తీవ్ర వేదన, కోపం నెలకొందన్నారు. ఇది కేవలం పర్యాటకులపై దాడి మాత్రమే కాదు.. భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన సాహసమని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లోని బైసరన్ పర్యాటక ప్రాంతంలో ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.