భారత్ సమాచార్.నెట్: పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం కశ్మీర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో భారత్ ప్రభుత్వం జమ్ము కశ్మీర్ విషయంలో తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ ఏకపక్షంగా చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు.
ఈ సమస్యపై న్యాయపరమైన పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నామంటూ షహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు వంటి ఏకపక్ష చర్యల్లో అంతర్జాతీయ సమాజం పాత్ర పోషించాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా.. పాకిస్తాన్ యూమ్-ఇ-ఇస్తేసల్గా పాటిస్తోందని పేర్కొన్నారు. కాగా శాంతి కోసం 2019లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆగస్ట్ 5న ఆర్టికల్ 370 రద్దు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా సంచలన కామెంట్స్ చేశారు. తమ పొరుగు దేశాలతో పాకిస్థాన్ స్నేహపూర్వక సంబంధాలను ఆశిస్తోందని పేర్కొన్నారు. పొరుగు దేశాలతో ఘర్షణల కంటే చర్చలు, దౌత్యాన్ని ఎంచుకుంటుందన్నారు. అలాగే తమపై ఎవరైనా దురాక్రమణకు దిగితే అంతే గట్టిగా వారికి బదులు ఇచ్చేందుకు తమ సైన్యం తగిన సామర్థ్యం కలిగి ఉందన్నారు. కశ్మీర్ విషయంలో పాక్ సానుకూలంగానే ఉంటుందన్నారు.