భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పనులను ఇంకా చేపట్టలేదని ఏపీ ప్రభుత్వం తెలిపిందని కేంద్రం పార్లమెంట్ వేదికగా తెలిపింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భుషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఏపీ ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక అంచన కోసం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి అందించినట్లు తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత అధికారులు, పరివాహక ప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.
ఇకపోతే పోలవరం బనకచర్ల ప్రాజెక్టును 2027లోపు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుతో ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండనది చెబుతున్నారు. కేంద్రం అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని.. అనుమతి రాగానే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. అయితే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సహా బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి.