భారత్ సమాచార్.నెట్: కాథలిక్ క్రిస్టియన్ల మత గురువు (CatholicsReligiousHead) పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) అంత్యక్రియలు (Funeral) శనివారం మధ్యాహ్నం వాటికన్‌లోని (Vatican) సెయింట్ పీటర్స్ బసిలికా చర్చిలో జరిగాయి. చెక్కతో చేసిన శవపేటికలో ఉంచి పోప్ పార్థివదేహాన్ని ఖైదీలు, వలసదారులు ఖనననం చేశారు. దీంతో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ముగిశాయి. ఫ్రాన్సిస్ పార్ధివదేహానికి ప్రపంచ దేశాధినేతలతో పాటు లక్షలాది మంది అభిమానులు, క్రైస్తవులు తుది నివాళులు అర్పించారు.
తన 12 ఏళ్ల పదవీకాలంలో చర్చిలో సంస్కరణలకు, పేదల సేవకు పోప్ ఫ్రాన్సిస్ అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఆయన కోరిక మేరకే అంత్యక్రియల కార్యక్రమాలను నిరాడంబరంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం పోప్‌ను సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఖననం చేయాలి. కానీ దానికి భిన్నంగా ఆయనకు కోరిక మేరకు రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. అంత్యక్రియలకు ముందు సీనియర్ కార్డినల్స్ సమక్షంలో పోప్ ఫ్రాన్సిస్ శవపేటికకు సీలు చేశారు.
పోప్ పార్థీవ దేహంపై తెల్లటి వస్త్రాన్ని ఉంచారు. అలాగే నాణేలు ఉన్న బ్యాగ్, ఆయన పోప్‌గా ఉన్నప్పటి రికార్డు (రోజిటో)ను శవపేటిక లోపల పెట్టారు. జింక్, చెక్కతో చేసిన శవపేటికలో ఒక శిలువను ఉంచారు. చెక్కతో చేసిన శవపేటికలో ఉంచిన పోప్ పార్థివదేహాన్ని గత మూడు రోజుల్లో దాదాపు 2 లక్షలమంది సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఇకపోతే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, స్పానిష్ రాజకుటుంబీకులు సహా అనేక మంది ప్రపంచ నాయకులు పాల్గొన్నారు.