భారత్ సమాచార్.నెట్: ప్రముఖ యాక్టర్ (Actor) ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ సినిమాలను (Pakistan Movies) భారత్ నిషేధించిన (India Ban) సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ నటుల సినిమాలను భారత్ నిషేధించడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పుపట్టారు. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ సినిమాను భారత్ నిషేధించడంపై ఆయన భిన్నా అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఫవాద్ ఖాన్ సినిమాను భారత్‌లో నిషేధించడం సరైనదిగా అనిపించడం లేదంటూ ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. సినిమాను అనుమతిస్తే కావాలో వద్దో జనమే తేలుస్తారంటూ వ్యాఖ్యానించారు. మితిమించిన అశ్లీలత, పిల్లలపై వేధింపులు ఉన్న చిత్రాలను మినహా వేటినీ నిషేధించకూడదన్నారు. అయిత పాక్ నటుడి సినిమాకు ప్రకాశ్ రాజ్ సపోర్ట్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. దేశభద్రత, ప్రజల మనోభావాల కంటే సినిమాల విడుదల ముఖ్యమా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో బాలీవుడ్ నటులపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఎదురించే ధైర్యం సినీ పరిశ్రమలో చాలామందిలో లేదని.. వారంతా అమ్ముడుపోయారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా.. సోషల్ మీడియా వేదికగా తరచూ ప్రభుత్వ విధానాలపై గళమెత్తే ఆయన.. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.