భారత్ సమాచార్.నెట్, తెలంగాణ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ (Pranay Murder case) హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు చనిపోవటంతో.. ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించింది కోర్టు. మొత్తం ఎనిమిది మందిని దోషులుగా నిర్థారించిన కోర్టు.. సుభాష్ శర్మకు మరణ శిక్ష విధించగా.. మిగతా ఆరుగురికి జీవిత ఖైదు విధించింది కోర్టు. మొత్తం 78 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంగానే ప్రణయ్‌ను హత్య చేసినట్లు నిర్థారించింది. అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి.. ప్రణయ్‌ను హత్య చేయించినట్లు కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో ఏ1గా ఉన్న మారుతీ రావు మరణించగా.. ఏ2గా ఉన్న సుభాష్‌కుమార్ శర్మకు ఉరి శిక్ష విధించింది కోర్టు. A3 అస్గర్ అలీ, A4 బారీ, A5 కరీం, A6 శ్రావణ్ కుమార్, A7 శివ ,A8 నిజాంలకు జీవిత ఖైదీ విధించింది నల్గొండ కోర్టు. కాగా, తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుసుకుందన్న కోపంతో అమృత తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14న ప్రణయ్‌ని హత్యచేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి.. 1600 పేజీల్లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. సుమారు ఐదేళ్ల పైగా కోర్టులో విచారణ సాగగా.. ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా నల్గొండ కోర్టు తుది తీర్పు వెలువరించింది.
ఇక ఇదే కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మారుతీరావు మార్చి 7, 2020న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఏ2గా ఉన్న సుభాష్ కుమార్‌కు తప్ప మిగతా వారందరికీ బెయిల్ లభించింది. అయితే అస్గర్ అలీ వేరే కేసులో జైలులో ఉన్నాడు. కాగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. తమపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లల కోసం శిక్ష తగ్గించాలని నిందితులు కోర్టును వేడుకున్నారు.