భారత్ సమాచార్.నెట్, బిహార్: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. బీహార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనకు గాయాలుకావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అరా సిటీలో సభకు హాజరైన ప్రశాంత్ కిషోర్ సభ అనంతరం నడుస్తూ వెళ్లి జనంతో మాట్లాడుతుండగా ఓ గుర్తుతెలియని వాహనం ఆయనను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన పక్కటెముకలకు గాయాలవడంతో వెంటనే పాట్నాలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిశోర్ 2024 అక్టోబర్ 2న సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. త్వరలో జరుగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 243 స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే అభ్యర్థులను కూడా ఖరారు చేశారు.
అభివృద్ధిని పక్కనపెట్టి.. హత్య రాజకీయలు:
బిహార్ రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీ ప్రకటన రాకముందే పలు పార్టీ నాయకులు విమర్శలు, సవాళ్లతో ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. మరోవైపు గతకొంతకాలంలో బిహార్ లో వరుస హత్యలు, అత్యాచారాలు పెరగడంతో, అనుమానాస్పద హత్యలు పెరుగుతుండడంతో తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. బిహార్ రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి రాజకీయ నాయకులే హత్యలు ప్రేరేపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.