భారత్ సమాచార్, పిఠాపురం ;
పిఠాపురం ప్రజలు ఇచ్చిన గెలుపు గ్యారెంటీతోనే రాష్ట్రం మొత్తం కూటమి తరఫున తిరిగి ప్రచారం చేయగలిగానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గొల్లప్రోలులో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.పిఠాపురం ఇచ్చిన గొప్ప దైర్యానికి నేను ఎన్నిసార్లు శిరస్సు వంచి నమస్కరించినా సరిపోదన్నారు. పిఠాపురంలో త్వరలో స్థలం తీసుకుని ఇల్లు కడతానని తెలిపారు. ‘‘మొన్నటి ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో ఏం చేస్తున్నావని చాలా మంది అడిగారు. నేను ఆ రోజు ఒక్కడినే కూర్చుని పుస్తకం చదువుతున్నా. కూటమి విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నప్పటికీ ఫలితాలు ఎలా వచ్చాయి.. కూటమిని ప్రజలు ఆశీర్వదించారా లేదా అన్న ఒక్క విషయం మాత్రమే చెప్పాలని సూచించాను. నా బాధ్యతలు నేను సంపూర్ణంగా నిర్వర్తించాను. భగవంతుడు ఏది ఇస్తే అది తీసుకుందామని అనుకున్నాను. నా ప్రజలు అఖండ విజయం అందించారు. పిఠాపురం ప్రజలు దేశ చరిత్రను తిప్పగలిగిన, లిఖించదగిన విజయం అందిచారు. కడ వరకు ప్రజల కోసమే పని చేస్తానని మాటిస్తున్నాను.’’ అని పవన్ అన్నారు.
పిఠాపురానికి ఏమిచ్చావని లోపల ఉన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు
ఊరేగింపులు, సభలు, సమావేశాలు పెట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఇంత గొప్ప ఘన విజయం అందించిన పిఠాపురం ప్రజలకు నువ్వేమి ఘనంగా ఇచ్చావని లోపల ఉన్న పవన్ కళ్యాణ్ నన్ను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాడు. దీని కోసం నేను సగటు కూలీలా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. పిఠాపురాన్ని ఎవరూ చేయలేని అభివృద్ధి దిశగా నడిపిస్తాను. దేశ వ్యాప్తంగా పిఠాపురానికి గుర్తింపు తెచ్చిన రోజున గట్టిగా ఊరేగింపులు చేద్దాం. నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి అని దేశమంతా మాట్లాడుకున్నప్పుడు ఉత్సవాలు చేద్దాం. నియోజకవర్గం అద్భుతమైన మత సామరస్యానికి వేదిక. ఇక్కడ టూరిజం పెంపొందించడంతో పాటు ఉపాది అవకాశాలు సృష్టించాలి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాల్లో బలమైన ప్రత్యామ్నాయాలు ఉండేలా తీర్చిదిద్దాలి.
వైసీపీ పాలకులు అడ్డగోలుగా, నిర్లక్ష్యంగా పాలన చేశారు
పంచాయతీరాజ్ శాఖ చాలా లోతైన శాఖ. గ్రామాలకు ఏం చేయవచ్చు అని అధికారులతో సమీక్ష చేస్తుంటే అభివృద్ధికి ఎన్నో అవకాశాలతోపాటు బోలెడు సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. గత వైసీపీ పాలకులు పంచాయితీరాజ్ శాఖలో అవినీతి అక్రమాలు లెక్కలేనన్ని చేశారు. శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులపై పూర్తి స్థాయి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కేంద్రం పరిధిలోని జల్ జీవన్ మిషన్ పథకంలో అపరిమిత నిధులు ఉన్నాయి. గత ఐదు సంవత్సరాల కాలంలో పంచాయితీ రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వాటిని మెరుగుపర్చిన దాఖలాలు లేవు. రూ.3 వేల కోట్లు పంచాయతీ రాజ్ శాఖలో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇంకా బోలెడన్ని లోపాలు గుర్తించాం. ఇవన్నీ తీరాలంటే అధికారుల సహాయసహకారాలు కావాలని స్పష్టంగా చెప్పాను.
వైసీపీ అవినీతి నేపాల్లో దొరికింది
అటవీ శాఖపై ఇటీవల సమీక్ష నిర్వహించినప్పుడు శేషాచలం అడవుల్లో లభించే ఎర్రచందనం కొట్టివేసి ఆ దుంగలను వైసీపీ హయాంలో దేశం దాటించి నేపాల్లో దొరికిపోయిన పైల్ నా ముందుకు వచ్చింది. అక్కడి నుంచి ఎర్ర చందనం విడిపించేందుకు కిందా మీద పడుతున్నాం. వైసీపీ హయాంలో అన్నీ అక్రమాలే జరిగాయి.
ఒక వజ్ర సంకల్పం తీసుకుందాం
2047కి భారత్ సూపర్ పవర్ కావాలి. అరబిందో కోరుకున్నట్టు భారత్ విశ్వ గురువు కావాలి. భారత దేశానికి తలామానికం రాష్త్రం అయితే రాష్ట్రానికి తలామానికం పిఠాపురం కావాలి. భారత దేశ శక్తిసామర్ధ్యాలు ప్రపంచానికి తెలియచెప్పేలా సకల గురువులు విశ్వ గురువు భారత దేశం వైపు తిరిగి చూసేలా ఈ వజ్ర సంకల్పం తీసుకుందాం. 2047 సూపర్ పవర్ అయ్యే భారత దేశానికి బీజం పిఠాపురంలోనే పడాలి. నేను ఇక్కడ మన నాయకులను నియమించాను. వారు సమన్వయ బాధ్యతలు చూసుకుంటారు. కష్టపడే కార్యకర్తలను ప్రతి ఒక్కరినీ గుర్తించాలని సూచించాను… పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధి, అభ్యున్నతి కోసం నిరంతరం తాపత్రయపడతానని, ఆఖరి శ్వాస వరకు దాని కోసం పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.