భారత్ సమాచార్, అమరావతి ;
నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి వచ్చే గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు అధికారికంగా ప్రకటించారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్ సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇందులో ధరల స్థిరీకరణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో నిత్యావసర సరకులను ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంచడం, వారికి ఉపశమనం కలిగించడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.181 ఉన్న కందిపప్పు రూ.160, బియ్యం రూ.52.40 ఉంటే రూ.48కీ, స్టీమ్డ్ బియ్యం రూ.55.85 ఉంటే రూ.49 చొప్పున విక్రయిస్తారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ కమిషనర్ సిద్దార్థ్ జైన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎమ్.డి.వీరపాండ్యన్ పాల్గొన్నారు.
