July 28, 2025 5:21 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Raja Singh: బీజేపీకి రాజాసింగ్ లవ్ లెటర్

భారత్ సమాచార్.నెట్: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీపై తీవ్ర అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన అధికారికంగా ప్రకటించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఈ ప్రకటన చేయడం గమనార్హం.

రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావును నియమించడాన్ని రాజాసింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని వచ్చిన అవకాశం ఇవ్వకపోవటంపై రాజాసింగ్ మండిపడ్డారు. అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు వచ్చిన తన మద్దతుదారులను బెదిరించారని రాజాసింగ్ ఆరోపించారు. ముందుగానే నిర్ణయించి అధ్యక్షుడిని ప్రకటించారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనేది తన కోరిక అని.. కానీ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారికి ప్రాధాన్యత దక్కుతుందని రాజాసింగ్ ఆరోపించారు.

పార్టీ కోసం ఎంత చేసిన గుర్తింపు లేదని.. అందుకే పార్టీకి లవ్ లెటర్ (రాజీనామా లేఖ) ఇచ్చి వెళ్తున్నానను అని రాజాసింగ్ పేర్కొన్నారు. మీకు మీ పార్టీకి ఓ దండం అని ఉద్వేగంతో మాట్లాడారు. బీజేపీ నుంచి తప్పుకున్నా.. హిందుత్వం కోసం తన పోరాటం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా గత కొంతకాలంగా రాజాసింగ్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంతే కాదు ఆ పార్టీలోని ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇక రాజాసింగ్ బీజేపీకి, అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు స్పీకర్‌ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

 

Share This Post
error: Content is protected !!