July 28, 2025 12:28 pm

Email : bharathsamachar123@gmail.com

BS

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy)కి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) లేఖ రాశారు. శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్భంగా ఏప్రిల్ 6న నిర్వహించనున్న శోభాయాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా యాత్ర కొనసాగేలా చూడాలని.. అనవసరమైన అడ్డంకులు సృష్టించవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad Police Commissioner) సీవీ ఆనంద్‌కు ఆదేశాలు ఇవ్వాలని రాజా సింగ్ కోరారు. తన లేఖలో రాజాసింగ్ ఇలా రాసుకొచ్చారు.

శ్రీరామ నవమి శోభాయాత్ర 2025 ఏప్రిల్ 6న తన నియోజకవర్గం గోషామహల్‌లోని ధూల్‌పేట్‌లోని ఆకాశపురి హనుమాన్ మందిర్ నుండి ప్రారంభమై సుల్తాన్ బజార్‌లోని హెచ్‌విఎస్ పబ్లిక్ స్కూల్ వద్ద ముగుస్తుందని తెలిపారు. 2010 నుండి ఈ శోభ యాత్రకు తాను నాయకత్వం వహిస్తున్నానని.. ఈ 15 సంవత్సరాలలో ఒక్కసారి కూడా హైదరాబాద్‌లో శాంతికి భంగం కలిగించలేదన్నారు. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది రామభక్తులు భక్తితో, క్రమశిక్షణతో యాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు.

అయితే ఈ ఏడాది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి ఆనంద్, ఏసీపీ, డీసీపీల ద్వారా తనపై ఒత్తిడి తెస్తున్నారని.. యాత్ర సమయంలో సౌంట్ సిస్టమ్‌ల వాడకాన్ని పరిమతం చేయడానికి సౌండ్ కాలుష్యంపై సుప్రీం కోర్టు తీర్పులను ఉదహరించారు. ఈ నియమాలు ఏకరీతిలో అమలు చేయబడుతున్నాయా అని నేను ప్రశ్నించాలనుకుంటున్నాను. అలా అయితే.. నగరంలో శబ్ద కాలుష్యం రోజుకు ఐదుసార్లు, సంవత్సరంలో 12 నెలలు ఎటువంటి పరిమితులు లేకుండా ఎందుకు వినిపిస్తుంది? అని ప్రశ్నించారు.
ఇటీవల ఏఐఎంఐఎం సమావేశం లౌడ్ సౌండ్ సిస్టమ్లు, డీఐ మ్యూజిక్‌తో నిర్వహించారని.. అయినప్పటికీ అధికారులు ఎటువంటి అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం చేయలేదన్నారు. ప్రతి సంవత్సరం.. ఈ శోభా యాత్రను నిర్వహించినందుకు పోలీసులు తనపై కేసులు నమోదు చేస్తారని.. కానీ అది తనని యాత్రను చేపట్టకుండా ఎప్పుడు ఆపలేదన్నారు. ఈసారి కూడా.. యాత్ర గతంలో కంటే గొప్పగా ఉంటుందని.. లక్షలాది మంది రామ భక్తుల భక్తిని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు.
Share This Post
error: Content is protected !!