భారత్ సమాచార్.నెట్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఈరోజు వరకు విపక్షాలు సభా గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్‌పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడ్డంతో.. తాజాగా ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ జరిగింది. విపక్షాల నిరసనలతో వాయిదా పడిన సభ.. మధ్యహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైంది. దీంతో ఆపరేషన్ సింధూర్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చ ప్రారంభించారు.
పహల్గామ్ ఉగ్రదాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు రాజ్‌నాథ్ సింగ్. మతం పేరు అడిగి మరి పర్యాటకులను చంపడం దురదుష్టకరమన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు. మే 7వ తేదీన రాత్రి భారత్ బలగాలు తమ శక్తి, సామర్థ్యాలు చాటిచెప్పాయని కొనియాడారు. పీవోకే, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయన్నారు. 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశారని తెలిపారు. సింధూర్ అనేది వీరత్వం, శౌర్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.
పాక్‌లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్ సైన్యం దాడులు జరిపిందన్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాక్ సైన్యం భారత్‌పై దాడికి దిగిన భారత్ సైన్యం పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయన్నారు. మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. భారత్ దాడులపై ప్రపంచ దేశాలు మద్దతు తెలిపాయన్నారు. యుద్ధం తమ లక్ష్యం కాదని.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడమే లక్ష్యమని వ్యాఖ్యానించారు. సైనిక సత్తాను ప్రశ్నించడం సరికాదని ప్రతిపక్షాలపై మండిపడ్డారు రాజ్‌నాథ్.