భారత్ సమాాచార్.నెట్: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఆలయాల డ్రెస్సింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సందర్భాన్ని బట్టి మన డ్రెస్సింగ్ మారాలని చెప్పారు. ముఖ్యంగా పవిత్ర ప్రదేశాలకు అంటే ఆలయాలకు వెళ్తే సంప్రదాయ వస్త్రధారణ (Traditional attire) వెళ్లాలని పేర్కొన్నారు. లాక్మే ఫ్యాషన్ వీక్ (Lakme Fashion Week )లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆ ఈవెంట్‌లో రకుల్ మాట్లాడుతూ.. పబ్లిక్ ఫిగర్‌గా మనం ఏది చేసినా బాధ్యతాయుతంగా చేయాలన్నారు. ఫ్యాషన్ అనేది ఒక వ్యక్తిగత విషయం అయినా, సందర్భాన్ని బట్టి మనం ఏం ధరిస్తున్నామనేది ఎంతో ముఖ్యమన్నారు. జిమ్ కి వెళ్లినప్పుడు వర్కౌట్ కి అనుగుణంగా.. డిన్నర్ కి వెళ్తే అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా వస్త్రధారణ ఉండాలని పేర్కొన్న రకుల్.. దేవాలయాల్లోనూ మన సంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తులను ధరించాలని రకుల్ నొక్కి చెప్పారు.
ఇకపోతే దేశ వ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాల్లో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రావడంతో ఆలయ సందర్శనకు సంబంధించిన నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి. ముఖ్యంగా సాంప్రదాయ వస్త్రధారణపై చాలా ఆలయాలు నియమాలు తీసుకొచ్చాయి. ఆలయాలకు వచ్చే భక్తులు ఆలయ పవిత్రతకు అనుగుణంగా దుస్తులు ధరించాలని ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేశాయి. పొట్టి దుస్తులు, శరీర ఆకృతి కనిపించే దుస్తులను నిషేధిస్తూ ఆలయ కమిటీలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సరైన వస్త్రధారణ పాటించాలనే విషయాన్ని ప్రస్తావించడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.