భారత్ సమాచార్.నెట్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కీలకమైన వడ్డీ రేట్ల (Interest Rates)ను సవరించింది. వరుసగా రెండోసారి రెపో రేటు (Repo Rate)ను 0.25 శాతం మేర తగ్గించింది. ఇప్పుడు రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. ఏప్రిల్ 7 నుంచి అమల్లోకి వచ్చిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (Monetary Policy) నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా కీలక వడ్డీరేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
వడ్డీరేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. దీంతో ఈఎంఐ చెల్లింపులు తగ్గే అవకాశముంది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరికి మారాలని కమిటీ నిర్ణయించిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అసాధారణ అనిశ్చితిలో ఉండటంతో విధానాల రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయని మల్హోత్రా అన్నారు. దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తంగా ఉంటున్నామన్నారు. ప్రధాన వృద్ధికి మద్దతు ఇచ్చే ద్రవ్య విధానాన్ని పాటిస్తున్నామన్నారు.
ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంసీఎల్ఆర్‌తో ముడిపడి ఉన్న రుణాలపై ప్రభావం కనిపించేందుకు సమయం పడుతుంది. ఎంసీఎల్ఆర్ అనేది హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. రెపో రేట్ల కోత ప్రభావం ఎంసీఎల్‌ఆర్‌లో పూర్తిగా ప్రతిబింబించేందుకు కనీసం రెండు త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో గోల్డ్ లోన్ కంపెనీలపై భారీ ఎఫెక్ట్ పడింది. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు అయితే దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి. అలాగే మణప్పురం ఫైనాన్స్ షేర్లు 3 శాతం, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ షేర్లు 4.7 శాతం మేర క్షీణించాయి. కాగా, ముత్తూట్ ఫైనాన్స్ జారీ చేసే రుణాల్లో దాదాపు 98 శాతం బంగారం తాకట్టుగా పెట్టి ఇచ్చేవే కావడంతో, ఆ సంస్థపై ప్రభావం తీవ్రంగా పడింది.