భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని పాశమైలారంలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. రసాయన పరిశ్రమంలో రియాక్టర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు14 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలంలో ఐదుగురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 9 మంది మరణించారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవాన్ కూడా మరణించారు. గోవన్ ఉదయం ప్లాంటులోకి వచ్చిన సమయంలోనే భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. రియాక్టర్ ఛాంబర్ భవనం కుప్పకూలగా.. మరో భవనం బీటలు వారింది. ప్రమాద స్థలిలో కార్మికుల మృతదేహాలు గుర్తు పట్టలేనంత చెల్లాచెదురయ్యాయి. కార్మికుల కుటుంబ సభ్యుల, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది.
మరోవైపు ఘటన స్థలిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రియాక్టర్ పేలడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో చాలామంది కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్లు పరిశ్రమలోనే చిక్కుకుపోయారనే అనుమానంతో కార్మికుల కుటుంబాలు లోపలికి వెళ్లేందుకు యత్నించాయి. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకోవడంతో కుటుంబసభ్యులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.