భారత్ సమాచార్, విజయవాడ ;
ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక, అసెంబ్లీ పోలింగ్ వివరాలపై ఏపీ ఎన్నికల కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు.
ఓటరు చైతన్యంతో ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు. మొత్తంగా మీద ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు జరిగినట్టు ప్రకటించారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్ జరిగిందన్నారు. ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపారు. గత అసెంబ్లీ 2019 ఎన్నికల్లో 79.77 పోలింగ్ శాతం ఏపీలో నమోదైంది. గతంలో కంటే ఈ సారి2024లో 2.09 శాతం అధికంగా పోలింగ్ జరిగినట్టు చెప్పారు. అత్యధికంగా దర్శిలో 90.91 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు.
3,500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగినట్టు ఆయన తెలిపారు. సాయంత్రం 6 తర్వాత క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్కిరికి ఓటు వేసే అవకాశం కల్పించినట్టు చెప్పారు. కొన్ని చోట్లు అర్థరాత్రి 2 వరకూ కూడా పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. కొందరు ఓటర్లు అసెంబ్లీకి, మరికొందరు లోక్ సభకు ఓటేయలేదన్నారు. 350 స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంలు భద్రపరిచామని తెలిపారు. పార్లమెంట్ కు 3కోట్ల 33 లక్షల 4560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కొన్ని పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరిగిందన్నారు. రీపోలింగ్ పై ఎలాంటి వినతులు రాలేదన్నారు. తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేటలో గొడవలు చోటుచేసుకున్నాయి. అటువంటి అల్లర్లు జరిగిన ప్రాంతాలకు అదనపు బలగాలు పంపినట్టు పేర్కొన్నారు. ఆ 4 ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలుచేశామన్నారు. అల్లర్లు సృష్టించిన దుండగులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామన్నారు. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు 24 గంటలు ఉండవచ్చని పేర్కొన్నారు.
* 3 కోట్ల 33 లక్షల 4560 ఓట్లు..పార్లమెంట్ పోలింగ్
* 3కోట్ల 33లక్షల 40 వేల 333 ఓట్లు.. అసెంబ్లీ పోలింగ్
* భారత దేశంలో అత్యధిక శాతం ఏపీలో పోలింగ్
* పురుషుల కంటే మహిళల ఓట్లు 4,78, 325 ఓట్లు అధికం
* పురుషులు – కోటి 64 లక్షలు
* మహిళలు – కోటి 69 లక్షలు