భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు (Prabhakar Rao), శ్రవణ్ రావుల (Sravan Rao)కు రెడ్ కార్నర్ నోటీసులు (Red corner Notices) జారీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెడ్ కార్నర్ నోటీసుపై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐకు, సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం అందింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వీరిని వీలైనంత త్వరగా.. భారత్‌కు తీసుకురావాలని కేంద్ర హోంశాఖతో పాటుగా విదేశాంగ శాఖలతో తెలంగాణ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు.
రెడ్‌కార్నర్ నోటీస్ జారీని అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీకి సమాచారమిచ్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆ సమాచారం డీహెచ్‌ఎస్‌కు చేరితే వారిద్దరిని అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్(తాత్కాలిక) చేయ్యొచ్చు. అనంతరం డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా అమెరికా నుంచి భారత్‌కు పంపే ఛాన్స్ ఉంది. అయితే తమ ప్రొవిజనల్ అరెస్ట్‌ను అక్కడి న్యాయస్థానంలో వారు ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే రాజకీయ కక్షసాధింపులో భాగంగా తమను వేధిస్తున్నారని.. ఆశ్రయం కల్పించాలంటూ నిందితులు పిటిషన్ దాఖలు చేసినందున అక్కడి కోర్టు ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ అక్కడ ఊరట లభించకపోతే మాత్రం డిపోర్ట్ చేయడం ఖాయమే. అప్పుడు వారిద్దరిని అమెరికా నుంచి భారత్‌కు పంపనున్నారు. కాగా, ఇప్పటికే వీరిద్దరిపై అన్ని ఎయిర్‌పోర్టుల్లో లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఒకవేళా వీరు ఇరువురిని హైదరాబాద్‌కు రప్పించగలిగితే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రాజకీయ మలుపు తిరిగే అవకాశం ఉంది.