Homebreaking updates newsటీటీడీ ఆసుపత్రులు, విద్యాలయాలపై సమీక్ష

టీటీడీ ఆసుపత్రులు, విద్యాలయాలపై సమీక్ష

భారత్ సమాచార్, తిరుపతి ;

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న ఆసుపత్రులు, విద్యా సంస్థలపై టీటీడీ నూతన ఈవో శ్యామలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో జేఈవో (విద్యా, ఆరోగ్యం) గౌతమితో పాటు ఆయా ఆసుపత్రులు, విద్యాసంస్థల అధిపతులతో ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. ఇందులో భాగంగా స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌వి కుమార్‌ స్విమ్స్‌ సూవర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న రోగులకు అందిస్తున్న చికిత్సలు, సౌకర్యాలను ఈవోకు వివరించారు. తర్వాత శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి ఇప్పటివరకు చిన్నపిల్లలకు 2,901 గుండె శాస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. ఇందులో 1,544 ఓపెన్ హార్ట్ మరియు 1,357 కీ హోల్ సర్జరీలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుండే కాక అండమాన్, బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చి రోగులు శస్త్ర చికిత్సలు పొందినట్లు ఆయన తెలిపారు.

గత మూడేళ్లలో శ్రీ పద్మావతి హృదయాలయంలో ఉచితంగా నిర్వహించిన 16 గుండె మార్పిడిలను, ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో స్విమ్స్‌ నుంచి డాక్టర్‌ రామ్‌, డాక్టర్‌ జయచంద్రారెడ్డి, బర్డ్ ఆసుపత్రి ఆర్‌ఎంవో కిషోర్‌, వైద్యులు డాక్టర్‌ వేణుగోపాల్‌, టీటీడీ సీఎంవో డాక్టర్‌ మురళీధర్‌, ఇంచార్జి సీఎంవో డాక్టర్‌ నర్మద, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి ప్రిన్సిపల్ మరియు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్‌ రేణు దీక్షిత్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ విద్యాసంస్థలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల ఖాళీలు, నిధులు, కోర్సులు, ప్లేస్‌మెంట్‌లు తదితర అంశాలపై ఈవో సవివరంగా సమీక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం విసి రాణి సదాశివమూర్తి, నూతన దేవస్థానం విద్యాశాఖాధికారి నాగరాజ నాయుడు, టీటీడీలోని వివిధ కళాశాలల మరియు పాఠశాలల ప్రిన్సిపాల్స్ మరియు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

వాట్సాఫ్ వద్దు.. మెయిల్ చేయండి

RELATED ARTICLES

Most Popular

Recent Comments