August 5, 2025 11:53 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

NSA: జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ

భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack) నేపథ్యంలో భారత్ (India), పాక్ (Pakistan) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డు (National Security Advisory Board)ను కేంద్రం పునరుద్ధరించింది. జాతీయ భద్రతా సలహా మండలి ఛైర్మన్‌గా.. రా (RAW) మాజీ చీఫ్ అలోక్ జోషి (Alok Joshi)ని నియమించింది. దేశ భద్రతా విషయాల్లో అనుభవం ఉన్న అలోక్ జోషి నాయకత్వంలో ఈ బోర్డు దేశ భద్రత వ్యూహాలను మరింత బలోపేతం చేయనుంది.

ఈ బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉండనున్నారు. వీరంతా తమ రంగాల్లో అనుభవజ్ఞలైన రిటైర్డ్ అధికారులు. సైనిక సేవల నుంచి రిటైరైన మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా ఈ బోర్డులో భాగస్వాములుగా ఉన్నారు. అలాగే ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన రిటైర్డ్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, విదేశాంగ సేవకు చెందిన రిటైర్డ్ అధికారి బి వెంకటేష్ వర్మ కూడా ఈ పునఃసంఘటిత బోర్డులో సభ్యులుగా ఉన్నారు.
ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడికి స్పందనగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో నిర్వహించిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, అంతర్జాతీయ రాజకీయాలు, సైబర్ భద్రత, ఉగ్రవాద బెదిరింపులు వంటి అంశాలపై ఈ బోర్డు సమగ్ర విశ్లేషణలు, సలహాలు అందించనుంది. ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన సమావేశంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే అని.. ఉగ్రవాదాన్ని మట్టి కరిపించాలన్నది తమ సంకల్పమని.. ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Share This Post