భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ టారిఫ్‌లపై ఇప్పటికే ప్రధాని మోదీ, భారత్ విదేశాంగ శాఖ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ట్రంప్ వైఖరి పట్ల తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
భారత్‌పై ఇష్టారీతిన ట్రంప్ టారిఫ్‌లను విధించడంపై శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా దిగుమతులపై భారత్ కూడా ప్రతీకార చర్యలు చేపట్టాలన్నారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధించిన సుంకాలు మనపై కచ్చితంగా ప్రభావం చూపిస్తాయని.. సుంకం అధికంగా ఉన్నప్పుడు మన వస్తువులు ఎందుకు కొనాలి అని కొనుగోలుదారులు కూడా ఆలోచిస్తారన్నారు.
అమెరికా వస్తువులపై మన కేవలం 17 శాతమే ట్యాక్స్ విధిస్తున్నామని.. ఇప్పటి నుంచి 50 శాతం విధించాలని కేంద్రన్ని కోరారు. రష్యా నుంచి మన కంటే చైనా ఎక్కువ చమురు కొనుగోలు చేస్తోందని.. కానీ ఆ దేశానికి సుంకాల నుంచి 90 రోజులు రిలీఫ్ ఇచ్చారని.. భారత్‌కు మాత్రం మూడు వారాలే ఉపశమనం కల్పించారని.. ఇది సరికాదన్నారు. వేరే ఏ ఇతర దేశాలు కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడకుండా ఉండాలంటే కేంద్రం కూడా ప్రతీకార చర్యలు చేపట్టాలన్నారు.