భారత్ సమాచార్.నెట్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్షపడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చినట్టు ఢాకా మీడియాలో కథనాలు వచ్చాయి. న్యాయస్థానంలోని ఛైర్మన్ జస్టిస్ ఎండి గోలం మోర్జుజా మొజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆమెకు శిక్ష విధించింది.
అలాగే గైబంధ జిల్లా గోవిందగంజ్‌కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్ కు రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఢాకాకు చెందిన రాజకీయవేత్త, అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం బంగ్లాదేశ్ ఛత్ర లీగ్‌తొ బుల్బుల్ సంబంధాలు కలిగి ఉన్నాడు. కాగా గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయింది షేక్ హసీనా. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితి కారణంగా ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెపై ఇప్పటికే అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రస్తుత యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, షేక్ హసీనా దేశానికి తిరిగే అవకాశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై ఉన్న కేసులపై మరింత దృష్టి సారించడంతో, బంగ్లా రాజకీయాల్లో మరో కీలక మలుపు వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.