భారత్ సమాచార్, జాతీయం ;
ఒక వైపు దంచికొడుతున్న ఎండలు, మరోవైపు అంతకు మించి హీట్ ను పుట్టిస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం. వీటితో విసిగిపోయిన ప్రజలకు భారత వాతావారణ శాఖ ఒక చల్లని కబురును మోసుకొచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ తుపానుకు ‘రేమాల్’గా నామకరణం చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. మధ్య బంగాళాఖాతంలో సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అన్ని పోర్టులకు ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.
ఈ తుపాను ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ వద్ద 27వ తేదీ అర్ధరాత్రి దాటాక తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒడిశా, బంగాల్, బంగ్లాదేశ్‌పై తుపాను ప్రభావం ఉంటుందని తెలిపారు. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పెద్దగా ఉండదని, అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వివరించారు. కాగా ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా చెదురు మదురుగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించాయని వెల్లడించింది.