Homemain slidesనేను వాడి మనసుని కొన్నాను...

నేను వాడి మనసుని కొన్నాను…

భారత్ సమాచార్, అక్షర ప్రపంచం ;

సాయంత్రం సూర్యుడు మరో దేశంలో గొప్పలు చెప్పటానికి పోతున్నాడు…
‘ఓం భూర్భువస్సువ: తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియోయోన: ప్రచోదయాత్’… అలెక్స స్పీకర్ నుంచి వస్తోన్న ఆ మంత్రాలు వింటూ, ఊపిరి సలపని ఉద్వేగాలతో స్నానం చేస్తోంది ఊర్మిళ.

హైదరాబాద్ విశ్వనగరంలో ఒక టీకొట్టు చుట్టూ సిగరెట్ ప్రియుల మధ్య దమ్ము కొడుతూ… చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు వెంకటకృష్ణ. ఎంత మంది దగ్గర ఎన్ని అప్పులు ఉన్నాయి, వాటికి వడ్డీ ఎంత అనే ఆలోచనలతో చాలా గందరగోళంగా కనిపిస్తున్నాడు. ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టినా కూడా కాల్స్ వస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే వైబ్రేషన్ సౌండ్ ఇరిటేట్ చేస్తోంది తనని. నోటిఫికేషన్ బార్ లో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అన్నీ కూడా అప్పు ఇచ్చిన వాళ్ల దగ్గరి నుంచే, వాటిని రిమూ చేస్తూంటే ఒక లోన్ యాప్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది.మిస్టర్ వెంకట్ కృష్ణ మీరు మా దగ్గరి నుంచి తీసుకున్న అప్పు సరైన సమయంలో చెల్లించటం లేదు. మిమ్మల్ని సంప్రదించటానికి కాల్స్ చేస్తుంటే మీరు స్పందించటం లేదు. ఈ కారణంగా మీ మీద కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయటం జరుగుతుందని ఆ సందేశం. దాన్ని చదివిన తర్వాత వెంకట్ నిట్టూర్చి మరో సిగరెట్ ను వెలిగిస్తూ, అప్పులు తీర్చే మార్గం గురించే ఆలోచిస్తున్నాడు.ఇంతలో వైబ్రేషన్ సౌండ్ తో మరో నోటిఫికేషన్ వచ్చింది. రెండు రోజుల ముందు రిజిస్టర్ అయినా ఒక కొత్త డేటింగ్ యాప్ నుంచి వచ్చింది అది. “డియర్ వెంకటకృష్ణ… మీ గురించి మొత్తం తెలుసుకున్న మీరు ఫ్రీ ఐతే కలుద్దాం “అంటూ దాని సారాంశం. దాన్ని చూసిన వెంకట్ కొంచెం షాక్ కి గురయ్యాడు, మరికొంచెం ఆశ్చర్య పడ్డాడు, ఇంకొంత భయంకూడా అతని మనసుని ఆవహించింది.

స్నానం చేసి వచ్చి ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను కొత్తగా చూసుకుంటోంది ఊర్మిళ. పెళ్లి తర్వాత ఇంతకు ముందెప్పుడూ లేని ధైర్యం ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది. కారణం తన భర్త ఇంట్లో లేకపోవటమే. తనకు ఇష్టమైన మెరూన్ కలర్ చీరను కట్టుకొని అద్దం ముందు ముద్దుగుమ్మలాగా మెరుస్తోంది. ఐదు అంతస్థుల మేడ నుంచి నడుచుకుంటూ వస్తున్న తనని పనివాళ్లు వింతగా గమనిస్తున్నారని ఆమెకి అర్థం అవుతోంది. ఆమెను చూసి బెంజ్ కారును బయటకి తీస్తున్న డ్రైవర్ తో వెహికల్ ను వద్దంటూ సైగలు చేసింది. వీధి చివరికి నడిచి షేర్ ఆటో ఎక్కి వెళుతోంది.

పెద్ద, పెద్ద అక్షరాలతో ఉన్న ‘‘ది పార్క్’’ అనే ఫైవ్ స్టార్ట్ హోటల్ బోర్డును చూస్తూ అక్కడే నిలబడిపోయాడు వెంకట్. ఆటోలో అక్కడికి చేరుకున్న ఊర్మిళ రిసెప్షన్ లో వెంకట్ కోసం వెయిట్ చేస్తోంది. “హలో వెంకట్, ఎక్కడ ఉన్నారు”. “హా… హాయ్ మేడం, నేను హోటల్ బయటే ఉన్న ” “ఓకె… నేను మీకు ఇన్ పాస్ పంపిస్తా, అక్కడి సెక్యూరిటీకి చూపించి లోపలికి రండీ” అంటూ కాల్ కట్ చేసింది. ఆమె ప్రశాంతంగా ఉండటానికి చాలా ప్రయత్నిస్తోంది… కానీ ఊర్మిళ మెడ మీద చెమటలు పడుతున్నాయి. వాటిని తన పైట కొంగుతో అప్రయత్నంగా చెరిపేస్తోంది. ఆమె ముఖంలో కొంచెం అశాంతి కనిపిస్తోంది. రూం లోకి వెళ్లి ఒక సిట్టింగ్ టేబుల్ దగ్గర ఇద్దరూ కూర్చొని ఉన్నారు. ఒకరిని ఒకరు చూసుకోలేక దిక్కులు చూస్తూ కూర్చున్నారు.ఆమె కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఆలోచిస్తుంది… కొంచెం గ్యాప్ తీసుకొని ఊర్మిళ మాట్లాడటం మొదలు పెట్టింది.

“చెప్పండి వెంకట్ గారు మీరు ఇలా ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు”. అతను కొంచెం మెహమాటంగా, ఆశ్చర్యంగా చూస్తూ… మీరు చెపితే నమ్మరు కానీ, ఇదే నా ఫస్ట్ మీటింగ్ అండీ. ఊర్మిళ నుంచి ఏ రిప్లే రాకపోవటంతో, మొబైల్ లో డేటింగ్ యాప్ హిస్టరీ ని చూపించాడు. ఆమెకి కొంచెం ధైర్యం వచ్చి పంటి బిగువున నవ్వుతోంది. ఓకే, అయితే మీకు ఇలా అమ్మాయిల్ని, ఆంటీల్ని కలవటం బాగా ఇష్టమా ? లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వెంకట్ అలాగే దిక్కులు చూస్తూ… “చాలా గొప్ప కోరికలకి, ఉన్నతమైన కలలకి బలైపోయి, బ్రతకటానికి ఇంకో దారి కనిపించలేదు. అందుకే ఇలా వచ్చా” అంటూ ఎదురుగా ఉన్న బాటిల్ లో నీళ్లు తాగేస్తున్నాడు. ఊర్మిళ మౌనంగా అతడి వైపు చూస్తూ.. చాలా టైం ఉంది, కొంచెం క్లియర్ గా చెప్పండి ?.
“ఒకరి కింద కానీ, అందరితో పాటు కానీ బతకటం ఇష్టం లేదు, చదివింది ఇంజినీరింగ్ అయినా బిజినెస్ అంటే ఇష్టం. ఆ మక్కువతో ఇంట్లో ఉన్న డబ్బులు సరిపోక, కొంచెం అప్పు చేసి ఒక హోటల్ పెట్టా. అందరి జీవితాలను తల కిందులు చేసిన కరోనా నా జీవితాన్ని కూడా అప్పుల్లో పడేసింది. ప్రస్తుతానికి అప్పులు తీర్చటం కోసం చాలా పనులే చేస్తున్న, వాటిలోకి ఇప్పుడు కొత్తగా ఈ పని కూడా చేరింది అంతే”.

ఊర్మిళ తన కోపాన్ని దాచుకుంటూ … “మీరు మీ తప్పుల్ని బాగానే సమర్ధించుకుంటున్నారు, అచ్చం నా భర్తలాగే”. వెంకట్ కొంచెం నవ్వుతూ… “నా తప్పుల్ని నేను కూడా ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారండీ”. ఇంతకీ మీ క్వాలిఫికేషన్ ఎంటో చెప్పలేదు, నా తప్పులతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు చేస్తుంది పెద్ద తప్పు అని మీకు అనిపించటం లేదా ? పెళ్లి చేసుకున్న భర్త ఉండి, ఇంత డబ్బు ఉండి కూడా మీరు ఒక డేటింగ్ అప్ లో ఒక ముక్కుమొహం తెలియని వాడితో ఇప్పుడు, ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు. ఇది పెద్ద తప్పు కాదంటారా ?

ఈ ప్రశ్నను ఉదయం నుంచి ఊర్మిళ తనకు తానే చాలా సార్లు వేసుకుంది. మళ్లీ వెంకట్ ఇలా అడగటం తననేమి బాధపెట్టలేదు. తప్పో, ఒప్పో నాకు తెలియటం లేదు, పది సంవత్సరాల క్రితం మా నాన్న పెళ్లి అనే పేరుతో 20 లక్షలు కట్నంగా, ఖర్చుపెట్టి మరి నాకు ఓ మగాడిని కొనిచ్చారు. డబ్బులిచ్చి మరి ఓ అమ్మాయి స్వేచ్ఛను, ఆలోచనలను, జీవితాన్ని ఓ మగాడికి అప్పగించే వారే అమ్మానాన్న. అప్పటికి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అంతే. అసలు అబ్బాయిలకి ఎందుకు కట్నం ఇస్తారో కూడా తెలీదు అప్పుడు. పెళ్లి అనే పేరుతో నా జీవితానికి సంకెళ్లు వేశారు. ఇక అప్పటి నుంచి ఒక మనిషిగా, మహిళగా నాకంటూ ఒక ఇష్టం కానీ, జీవితం కానీ ఏదీ లేకుండా పోయింది. డబ్బులిచ్చి మరి నా మొగుడికి నా శరీరం మీద, జీవితం మీద పెత్తనాన్ని కట్టబెట్టారు. వంటిపై ఉండే బెల్టు గాయాలకు కారణాలేంటని మనసు ప్రశ్నిస్తే ? సమాధానం ఎవరిని అడగాలి. తిట్టడానికి కారణాలు వెతికే మనుషుల మధ్య నా జీవితం సాగుతోంది. ఈ మధ్యనే ఆలోచిస్తే తెలిసింది.
అతను, అలాగే వింటున్నాడు.. “మా నాన్న యిచ్చిన కట్నంతో వాడు కోట్లు సంపాదిస్తున్నాడు కానీ, మా నాన్న మాత్రం అప్పుడు తెచ్చిన అప్పులకి ఇంకా వడ్డీలు కడుతూనే ఉన్నారు. వెంకట్ ఇప్పుడు తన కళ్లని కూడా కదపకుండా ఊర్మిళని అలాగే చూస్తూ, ఆమె చెప్పే ప్రతి విషయాన్ని చాలా ఓపికగా వింటున్నాడు. నా మాటలు వినటానికి, నా బాధను పంచుకోటానికి ఈ భూమి మీద ఒక్కరు కూడా లేరనిపిస్తోంది.ఎవరికైనా ఇలాంటి మాటలు చెపితే, వాడు మగాడే, వాడు అలాగే ఉంటాడు అంటున్నారు. కానీ నేను ఒక మనిషిని, మహిళని అనే విషయం మాత్రం ఎవరూ గుర్తించటం లేదు. ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరిదో ??.
వెంకట్, ఊర్మిళనే చూస్తూ మౌనంగా కూర్చున్నాడు.
ఆ గది నిండా నిశబ్దం ఆవహించింది. ఊర్మిళ కంటి నుంచి వచ్చే కన్నీరు, ఆమె జీవిత నైరాశ్యానికి సాక్ష్యంగా నిలిచింది. వెంకట్ కంట్లో ఒక చిన్న నీటి బిందువు మొలిచింది. కొద్ది పాటి మౌనం తర్వాత ఊర్మిళ మనసు కొంచెం తేలిక పడింది. పెదాలపై వచ్చిరాని ఓ చిరునవ్వు కనిపించింది. జీవితంలో ఎన్నడూ చూడని ఏకాంతం దొరికిన గదిలో, మనసుకు హాయి కలిగే ఎన్నో పిచ్చాపాటీ సంభాషణలు సాగాయి వారిద్దరి మధ్య. మరి కొద్ది సేపట్లో కాలం ఆగిపోతుందేమో అన్నట్టు సాగాయి వారి ముచ్చట్లు.
ఈ సమయంలో కనీసం ఒకరి చేయి కూడా ఒకరు పట్టుకోలేదు వాళ్లు.

ఇక ఊర్మిళ వెంకట్ కి బై చెపుతూ… టేబుల్ మీద ఒక యాభై వేల రూపాయలు పెట్టి బయటకు నడుచుకుంటూ వెళ్లిపోతోంది. డబ్బు వద్దని మనసులో అనుకున్నా, బయటకు చెప్పటానికి ధైర్యం చాలటం లేదు. కారణం అతనికి తెలుసు అప్పులోడి మాటల్లో ఉండే బాధ.

బయటకు వెళుతున్న ఊర్మిళ ఫోన్ రింగ్ అవుతోంది.
హలో… ఎక్కడ ఉన్నావు ?అంటూ ఆమె భర్త.
బయట,
ఎం చేస్తున్నావ్ ?
గట్టిగా ఊపిరి పీల్చుకొని… నీ కెందుకు.
ఏంటే నోరులేస్తోంది.
ఆమె నవ్వుతూ…. రేయ్ నువ్వు అస్సలు మొగుడివే నా రా, ఇప్పుడే ఒకడిని కలిశా, వాడిని “కాల్ బాయ్” అని అంటారు. మూడు గంటలకి యాభై వేలు పెట్టి కొన్న, కనీసం వాడు ఆ మూడు గంటలు అయినా నా మాటలు విన్నాడు, నిన్ను ఇరవై లక్షలు పెట్టి కొన్నా కదా, నువ్వు నా జీవితాంతం, నా మాటలు వినాలి కానీ, నువ్వు దుబాయిలో ఆఫీస్ అంటూ, బిజినెస్ అంటూ, “కాల్ గర్ల్స్ “తో తిరుగుతూ…… కోపంతో, “ఇప్పటి వరకూ నువ్వు నాకు చేసిన మోసం” చాలంటూ మెడలో ఉన్న తాళిని తీసి గాల్లోకి విసిరేసింది. ఇదంతా చూస్తున్న వెంకట కృష్ణ తనలో తాను నవ్వుకుంటూ… మనసులో అనుకుంటున్నాడు… నమ్మలేకపోతున్నా, ఇప్పుడు, ఇక్కడ నా శరీరాన్ని కాదు, మనసును అద్దెకు ఇచ్చి లక్ష రూపాయలు సంపాదించాను. ఫోన్లో ఉన్న డేటింగ్ యాప్ ను డిలీట్ చేస్తున్నాడు.

ఇట్లు
మీ రచయిత

రామ్ యలగాల
8019202070

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

నా జీవితపు షడ్రుచుల మనోగతం…

RELATED ARTICLES

Most Popular

Recent Comments